కొత్తకోట రూరల్, ఫిబ్రవరి 24 : ‘తాను అధికార పార్టీకి చెందిన మహిళను కాద ని.. సర్పంచ్‌గా తాను చెప్పే పనులు చేయమంటూ గ్రామ పంచాయతీ సిబ్బంది తిరస్కరిస్తున్నారు’.. అంటూ వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గాయత్రీ అనిల్ వాపోయారు. మూడు నెలల కిందట జరిగిన స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజాదరణ పొందిన తనను గ్రామ సర్పంచ్‌గా ఎన్నుకున్నారని తెలిపారు.
అయితే తర్వాత తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకురాలిని కాదంటూ.. ఏమైనా పనులు పురమాయించినా పంచాయతీ సిబ్బంది వినడం లేదని ఆరోపించింది. తాను గ్రామానికి ప్రథమ మహిళ అని కూడా చూడకుండా చెప్పిన పనులను తిరస్కరిస్తున్నారని.. పది రోజులుగా ఇదే తంతు నడుస్తుందని.. ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో.. చెప్పుకోమంటూ సర్పంచ్ అన్న గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఆవేదన వెలిబుచ్చింది. మంగళవారం సిబ్బందికి పనులు అప్పగిస్తే చేయకపోవడంతో చేసేది లేక చివరకు స్వయంగా సర్పంచ్ గాయత్రి చీపురు చేతపట్టి.. గ్రామ పంచాయతీ కార్యాలయం లోపల.. ఆవరణను శుభ్రం చేసింది.
ప్రజలు తనను నమ్మి ఓట్లేసి సర్పంచ్‌గా ఎన్నుకున్నారని.. సిబ్బంది పనులు చేయకుంటే మురుగు కాల్వలను, రోడ్లు శుభ్రం, ఇతర పనులను తానే స్వ యంగా చేసుకుంటానని చెప్పింది. ఈ విషయాన్ని ఎంపీడీవో వినీత్ దృష్టికి తీసుకెళ్లగా.. గ్రామానికి వచ్చిన అధికారి.. జీపీలో పనిచేస్తున్న ముగ్గురు మహిళా, ముగ్గురు పురుష సిబ్బందితో మాట్లాడారు. నెలరోజులు సమయం ఇస్తామని.. పనులు చేయాల్సిందేనని, లేదంటే విధుల నుంచి తొలగిస్తామని ఎంపీడీవో హెచ్చరించారు.