మోర్తాడ్డ్, ఆగస్టు 8 : రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం..కంప్యూటర్ ఆపరేటర్లను కష్టాల్లోకి నెట్టింది. తహసీల్ ఆఫీసుల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లను ఆకస్మాత్తుగా తొలగించడంతో, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 20 ఏండ్లుగా పనిచేస్తున్న తమకు ఈ వయస్సులో ఎవరు ఉద్యోగం ఇస్తారని, తాము ఏం చేసి కుటుంబాలను పోషించుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
తహసీల్ కార్యాలయంలో ఏ పని కావాలన్నా కంప్యూ టర్ ఆపరేటర్ కావాల్సిందే. ఆపరేటర్ లేకపోతే పనులు సజావుగా సాగవు. తహసీల్ కార్యాలయానికి సంబంధించిన పనులన్నీ వీరిచేతుల మీదుగానే జరుగుతాయి. అటువంటి పనుల్లో అవుట్ సోర్సింగ్పై పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లను వాడుకోవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వారంతా వీధిన పడ్డారు. గత నెల 10 నుంచి తహసీల్ కార్యా లయాలకు కంప్యూటర్ ఆపరేటర్లు పనులకు రావడం లేదు. 20 ఏండ్లుగా సేవలందించామని, ప్రస్తుతం తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. తిరిగి తమను పనుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు.
తహసీల్ కార్యాలయంలో ప్రతి పనిని దాదాపుగా కంప్యూటర్ ఆపరేటర్లే చేస్తుంటారు. వీరు చేసే పనుల వివరాలు, మీసేవ సర్వీసులు, ప్రజావాణి, ప్రజాపాలన, ఆన్లైన్ పే బిల్లుల తయారీ, భూభారతి పనులు, పెండింగ్ మ్యుటేషన్లు, ల్యాండ్ రికార్డులను కంప్యూటరైజ్ చేయడం, సర్, జనరల్ ఎలక్షన్, లోక్సభ, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ పనులు, రెగ్యులరైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్, సాదాబైనామా, ఎల్ఈసీ కార్డ్స్, వీడియో కాన్ఫరెన్స్ మెయింటనెన్స్, ఆప్డేషన్ ఆఫ్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ప్రపోజల్స్, కోఆర్డినేషన్ విత్ డిస్ట్రిక్ట్ అండ్ డివిజన్ ఆఫీసర్స్, ల్యాండ్ రికార్డ్సు అప్డేషన్ ప్రోగ్రాం మొత్తంగా కార్యాలయానికి సంబంధించిన కరస్పాండెంట్ పనులన్నీ వీరే చేస్తారు.
తహసీల్దార్ కార్యాలయాల్లో 20ఏండ్లుగా కంప్యూటర్ ఆపరేటర్లు సేవలందిస్తున్నారు. వీరు 2007లో నియమించబడగా అప్పుడు కేవలం నెల కు రూ.4500 మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం వీరికి రూ.24వేలు అందిస్తున్నా రు.జిల్లాలో 28 మంది తహసీల్ కార్యాయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. 20 ఏండ్లుగా పనిచేస్తున్న వారు అకస్మాత్తుగా విధుల నుంచి తొలగించబడుతామని వారు ఊహించి ఉండరు. తక్కువ వేతనానికే పనిచేస్తూ ఏదోవిధంగా కుటుంబాలను నెట్టుకొస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లను వాడుకోవద్దన్న ప్రభుత్వ ఆదేశాలతో వారి కుటుంబాలు వీధిన పడ్డట్లయ్యింది. 20 ఏండ్లుగా పనిచేసిన తమకు ప్రస్తుత వయసు 40 నుంచి 50 మధ్యలో ఉంటాయని, ఇటువంటి పరిస్థితుల్లో తాము ఏ పనుల్లోకి వెళ్లగలుగుతామని, తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని వాపోతున్నారు.
ప్రభుత్వ ఆదేశాల కారణంగా ఆపరేటర్లు పనుల్లోకి రాకపోవడంతో తహసీల్ కార్యాలయాల్లో పనులన్నీ పెండింగ్లో పడే అవకాశాలు ఉన్నాయి. వారు చేసే పనులన్నీ ఎవరు చేయాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. కార్యాలయానికి సంబంధించిన పనులన్నీ కంప్యూటర్ ఆపరేటర్ల చేతుల మీదుగా జరిగేవి. ప్రస్తుతం వారు లేకపోవడంతో పనులు సకాలంలో పూర్తికావనే అభిప్రాయాలను సైతం అధికారులు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సర్ కార్యక్రమంలో, ప్రభుత్వ పథకాలకు సంబంధించి రాత్రింబవళ్లు కష్టపడిన కంప్యూటర్ ఆపరేటర్లు ప్రస్తుతం విధుల్లోకి రాకపోవడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
20 ఏండ్లుగా తహసీల్ కార్యాలయాల్లో రాత్రింబవళ్లు కష్ట పడి పనిచేసినం. జీతం తక్కువయినా, అధికారులు ఏం చేయమంటే ఆ పనులు చేసిపెట్టినం. కానీ ఆకస్మాత్తుగా పనుల నుంచి తొల గిస్తే మేమెటు పోవాలే. ఇప్పటికిప్పడు మాకెవరు పనులిస్తరు. మా కుటుం బాలను ఎలా పోషించుకో వాలే. ఒక్కొక్కరి వయసు 40పైనే ఉంది. అటువంటి వారికి ఎవరు పనులిస్తరు. మా కుటుం బాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తిరిగి తహసీల్ ఆఫీసు లోనే కంప్యూటర్ ఆపరేటర్లుగా తీసుకోవాలి.
-నజీర్, కంప్యూటర్ ఆపరేటర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి