నాగిరెడ్డిపేట్, ఆగస్టు 8: రసాయన ఎరువుల కొనుగోళ్లు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. రైతులకు మరిన్ని ‘యాప్’సోపాలు ఎదురుకానున్నాయి. ఇప్పటికే యూరియా కావాలంటే ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే వ్యవస్థ రావడంతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇక నుంచి యూరియాతో మిగతా ఎరువులు సైతం యాప్‌లోనే బుక్ చేసుకునే కొత్త వ్యవస్థ రానుంది. యూరియాతో పాటు డీఏపీ, పొటాష్, ఇతర కాంప్లెక్స్ ఎరువులు కూడా యాప్ ద్వారనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కర్షకులకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. కొద్ది రోజులుగా యూరియా కోసం తిప్పలు పడిన అన్నదాతలు రానున్న రోజుల్లో మిగతా ఎరువుల కొనుగోళ్లకూ ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. చదువుకోని వారు యూరియా ఎలా బుక్ చేసుకోవాలో తెలియక ఇప్పటికే సతమతమవుతున్నారు. ఇక మిగతా వాటిని ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలని చెబుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ పాలనలో ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చూశారు. పుష్కలంగా స్టాక్ అందుబాటులో ఉంచడంతో రైతులు సంతోషంగా పంటలు పండించుకున్నారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు యూరియా కష్టాలు ఎదురయ్యాయి. మొన్నటిదాకా షాపుల్లో, సహకార సంఘాల్లో పుష్కలంగా దొరికిన ఎరువులను ఆన్లైన్లో విక్రయిస్తుండడంతో చిక్కులు మొదలయ్యాయి. యూరియా కావాలంటే ఫర్టిలైజర్ యాప్‌లో బుక్ చేసుకోవాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికే ఎరువులు ఇస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చదువుకోని వారు, స్మార్ట్ ఫోన్లు లేని వారు ఎలా బుక్ చేసుకోవాలో తెలియక సతమతమయ్యారు.
యూరియా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడానికి కాంగ్రెస్ సర్కారు ఇటీవల ఫర్టిలైజర్ యాప్‌ను అమలులోకి తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్లు లేని వారు, నిరక్ష్యరాస్యులు తమకు తెలిసిన వారితో లేదా మీసేవల్లో బుక్ చేసుకుని ఎలాగోలా యూరియా తెచ్చుకుంటున్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన యాప్‌తో ఇప్పటికే అవస్థలు పడుతున్న రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. యూరియా యాప్‌ను రద్దు చేస్తూ, దాని స్థానంలో కొత్త యాప్ (ఫ్రేమ్‌వర్క్ ఫర్టిలైజర్ సేల్-ఎఫ్ఎఫ్ఎస్)ను తీసుకొచ్చింది. ఇక నుంచి ఏ రకమైన ఎరువులు పొందాలన్నా ఈ యాప్ నుంచే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎరువులు కావాలంటే రైతులు తప్పకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. లేకపోతే ఆధార్ ఆధారంగా యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాతే అవసరమున్న అన్ని రకాల ఎరువులను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఎరువుల కొనుగోలు సాధ్యపడదు. అయితే, ఇప్పటికే యూరియా బుక్ చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇక మిగతా ఎరువులు కూడా యాప్‌లోనే కొనుగోలు చేయాలనడం సరికాదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత పద్ధతిలోనే ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.