కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఫిబ్రవరి 9 : పుపోరు జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో అధికార పార్టీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూనే వస్తోంది. అయినా ఇప్పటి వరకు వారిపై చర్యలు తీసుకునే నాధులే కరువయ్యారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై ఇప్పటికే మూడు కేసులు నమోదు చేసిన ఎన్నికల నిర్వహణ అధికారులు అధికార పార్టీపై చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేయడం శోచనీయం. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు తమ డివిజన్లో ఏకంగా ప్రభుత్వ విద్యుత్ స్తంభాలకి అందులోనూ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి తమ పార్టీ జెండాలు కట్టడం విడ్డూరం.
రామవరంలోని 16వ, 19వ డివిజన్లో విద్యుత్ స్తంభాలకు కాంగ్రెస్ పార్టీ జెండాలు దర్శనమిస్తున్నాయి. ఈ విషయాన్ని స్థానికులు ఎన్నికల అధికారుల దృష్టికి సైతం తీసుకువెళ్లళ్లారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు సైతం అక్కడికి చేరుకొని జెండాలు తొలగించాలంటూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఫలితం శూన్యం. ఇతర పార్టీలపై ఎన్నికల నిర్వహణ అధికారులు కోడ్ ఉల్లంఘన పై కఠినంగా వ్యవహరిస్తూ అధికార పార్టీపై చర్యలు తీసుకోకపోవడంతో కొత్తగూడెంలో సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సి ఉంది.