– నేను లోకల్.. కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు
– జిరాక్స్ షాపు యజమానికి కాంగ్రెస్ నాయకుడి బెదిరింపులు
కొత్తగూడెం ఆర్బన్, సెప్టెంబర్ 15 : ఏయ్ బిడా.. ఇది నా అడ్డా. మున్సిపాలిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు. నేను లోకల్. మా అన్నవదినలు ఇద్దరూ మాజీ కౌన్సిలర్లు. నన్ను కాదని ఇక్కడ షాపు ఎవడురా పెట్టమన్నది నిన్ను. తీసేయ్.. లేకుంటే నా సంగతి తెల్వదు బిడ్డా. ఇది కాంగ్రెస్ నాయకుడి తమ్ముడి బెదిరింపులు. కొత్తగూడెం మున్సిపాలిటీ రోడ్ లోని ఓ కాంప్లెక్స్ లో దళిత కుటుంబానికి చెందిన భార్యభర్తలు బ్రతుకుదెరువు కోసం జిరాక్స్ షాపు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల కాంప్లెక్స్ యజమాని నూతన కన్స్ట్రక్షన్ చేపడుతున్నందున షాపు ఖాళీ చేయాలని జిరాక్స్ షాపు అతడికి తెలిపాడు. దీంతో వారు షాపు ఖాళీ చేశారు. బతుకుదెరువు కోసం మున్సిపల్ అధికారులను కలిసి మున్సిపల్ గోడకు కొంతకాలం వరకు షాపు ఏర్పాటు చేసుకుంటామని వేడుకోగా వారి పరిస్థితి తెలుసుకుని మానవతా ధృక్పథంతో రోడ్డు పక్కన ప్రజలకు, ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు.
దీంతో ఆ భార్యభర్తలు ఒక చిన్న షాపు ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన మాజీ కౌన్సిలర్ తమ్ముడు, ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అంటూ చెప్పుకుంటూ నా ఏరియాలో నాకు తెలియకుండా షాపు ఎలా పెట్టావు? నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, నా ఏరియాలో పెట్టుకుంటే మావాళ్లు షాపు ఏర్పాటు చేసుకోవాలి. నీవు ఎవడివి. ఎక్కడి నుంచి వచ్చావు అంటూ బెదిరంపులకు పాల్పడ్డాడు. సుమారు రెండు నెలలపాటు ఆ షాపు ఓపెన్ చేయకుండా, కరెంట్ కనెక్షన్ పెట్టుకోనీయకుండా నానా ఇబ్బందులకు గురిచేశాడు. భయాందోళనకు గురైన ఆ జిరాక్స్ షాపు నిర్వాహకుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన పలుకుబడిని ఉపయోగించి జిరాక్స్ షాపు నిర్వహకుడితో కేసు కాంప్రమైజ్ చేయించుకున్నాడు. ఇక సరే కదా అని జిరాక్స్ షాపు ఓపెన్ చేద్దామనుకునేలోగా, షాపు ఓపెన్ చేయవద్దని ఆ కాంగ్రెస్ నాయకుడి తమ్ముడు మరోసారి హుకూం జారీ చేశాడు.
నీవు షాపు ఓపెన్ చేస్తే రేపే నీ షాపు పక్కనే ఇంకో షాపు పెడతా.. నా సంగతి నీకు తెల్వదు అంటూ హెచ్చరించాడు. అప్పటికే రెండు నెలల నుంచి ఖాళీగా ఉంటున్న జిరాక్స్ షాపు నిర్వాహకుడు ఆర్ధిక ఇబ్బందులు పడుతూ ఎలాగైనా షాపు ఓపెన్ చేద్దామని అనుకున్నాడు. అంతే షాపు ఓపెన్ చేశాడో లేదో ఇట్టే అక్కడ వాలిపోయి మళ్లీ హెచ్చరించాడు. రాత్రికి రాత్రి మున్సిపల్ ప్రధాన గేట్ పక్కనే ఓ షాపు ఏర్పాటు చేశాడు. ఆ కాంగ్రెస్ నాయకుడి అండదండలతోనే ఆయన తమ్ముడు చెలరేగిపోతూ మున్సిపల్ ప్రధాన గేట్ పక్కనే షాపు ఏర్పాటు చేయడంతో భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఈ షాపు ఏర్పాటుపై మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.
మా కుటుంబమంతా జిరాక్స్ షాపుపైనే ఆధారపడి బ్రతుకుతున్నాం. రెండు నెలల నుంచి కాంగ్రెస్ నాయకుడి తమ్ముడు చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. ధైర్యం చేసి షాపు రెండు రోజుల క్రితం షాప్ ఓపెన్ చేసినం. మొన్న రాత్రికి రాత్రే మా షాపు పక్కనే ఇంకో షాపు పెట్టిండు. ఏం చేయాలో మాకు తెలియట్లేదు. ఆ కాంగ్రెస్ నాయకుడు తమ్ముడు చేయబట్టి మా షాపును కూడా అధికారులు తొలగిస్తారేమోనని భయంగా ఉంది. మాకు షాపు ఒక్కటే దిక్కు. ఇక్కడి నుంచి కూడా తొలిగిస్తే మేము రోడ్డున పడాల్సిందే. దయచేసి మాకు న్యాయం చేయండి.
Kothagudem Urban : ఏయ్ బిడ్డా…. ఇది నా అడ్డా