ఇల్లందు, మే 26 : పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం ఇలా అన్నింటా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ అన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ గుండాల దాడి, పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఆయన ఖండించారు. ఇల్లెందులోని తన కార్యాలయంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నాయకులపై దాడులు పరిపాటిగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంప్ కార్యాలయంపై దాడికి యత్నించిన కాంగ్రెస్ గుండాలను వదిలిపెట్టి, అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులపై లాఠీచార్జి చేయడం హేయమైన చర్యఅన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గద్దనెక్కినప్పటి నుంచి అన్యాయాన్ని ఎదిరించిన ప్రతిచోట పోలీసులతో లాఠీచార్జీ చేయిస్తుందన్నారు. మొన్న లగచర్లలో అమాయక గిరిజనులపై, అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని అడ్డుకున్న విద్యార్థులపై పోలీసులతో లాఠీచార్జి చేయడం అనేది బాధ్యత లేని సర్కారు వైఫల్యం అని మండిపడ్డారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి పోలీసులతో పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజలందరూ గమనిస్తున్నారని, భవిష్యత్లో తగిన రీతిలో సమాధానం చెప్పి తీరుతారని హెచ్చరించారు.