భద్రాద్రి కొత్త గూడెం, సెప్టెంబర్ 02 : కాంగ్రెస్ పాలన రాష్ట్రానికి పాపంలా,శాపంగా మరిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్లో బీఆర్ఎస్ బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టింది ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటేనన్నారు. అవి రెండు కలిసి పనిజేస్తూ బీఆర్ఎస్ ను అణచివేయాలని కుట్ర చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అన్నారు. అధికారంలోకి రావాలనే కుట్రపూరిత వైఖరితో కాంగ్రెస్ నాయకులు 6 గ్యారంటీ కార్డులు పంచి, 420 హామీలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇష్టారీతిన హామీలు గుప్పిస్తూ భద్రాచలం సీతారామచంద్ర, యాదాద్రి లక్ష్మీ నరసింహా, వేములవాడ రాజరాజేశ్వర స్వాములతో పాటు కనిపించిన దేవుళ్లు, మసీదు, చర్చీల ఓట్లు వేసి, ప్రజలకు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని ఆయన చెప్పారు. రైతన్నలకు రూ.2 లక్షల చొప్పున రూ.49 వేల కోట్లు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ నాయకులు చివరకు చేసినది రూ.18 వేల కోట్లు మాత్రమేనన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరాకు రూ.10 వేల చొప్పున పంట పెట్టుబడి అందజేసి వ్యవసాయ రంగాన్ని గొప్పగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ విషయాన్ని తాను పార్లమెంటులో వివరించి ఆదర్శవంతమైన ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని తెలిపారు. రైతు భరోసా పేరిట ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చాక మాట మార్చారని సక్రమంగా ఇవ్వడంలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం రైతు బీమా ఎగ్గొట్టిందని, కౌలు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని, సాగునీళ్లు లేవు, వరద నీళ్లను కిందకు వదిలిపెడుతూ రేవంత్ రెడ్డి తన గురుదక్షిణ చెల్లించుకుంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని, ప్రజలందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ లేదు, 6 డీఏలు లేవు, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీకాక నిరుద్యోగ యువత, ఫీజుల బకాయిలు అందక విద్యార్థులు, ఇస్తామన్న సాయం అందక ఆటో డ్రైవర్లు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను అమలు చేయకపోవడంతో మహిళలు పాలకులపై మండిపడుతున్నారన్నారు.

అబద్ధాల పునాదులపై అధికారంలోకి కాంగ్రెస్ : ఎంపీ వద్దిరాజు
బీసీ రిజర్వేషన్ల పెంపుదల లేదు, దళితబంధు లేదు, బీసీ బంధు లేదు, సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపట్టడం లేదు, సంక్షేమ పథకాల జాడనే లేదన్నారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పథకాలు,కట్టడాలను రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని,అప్పటి నిర్మాణాలను కొన్నింటిని మాత్రం రిబ్బన్ కట్ చేసి ఆర్భాటంగా ప్రారంభించి గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో అన్ని వైఫల్యాలే తప్ప అభివృద్ధి జరిగిందేమీ లేదని, వచ్చే రెండేళ్లలో ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చీటికిమాటికి అర్థంపర్థం లేకుండా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును తిట్టడంతో బూతుపితగా ప్రజలు పిలుచుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆయనతో పాటు మంత్రులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పాలనను గాలికొదిలేసి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటేనని, ఆ రెండు పార్టీల నాయకులు కలిసే పని చేస్తున్నారని, అధికారంలో లేని బీఆర్ఎస్ ను అణచివేయాలని కుట్ర పన్నుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలన రాష్ట్రానికి పాపంలా,శాపంగా మారిందన్నారు.
కాంగ్రెస్ 1000 రోజుల పాలనతో విసిగి వేసారిన ప్రజలు బీఆర్ఎస్, కేసీఆర్ వైపు చూస్తున్నారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.తెలంగాణ రాష్ట్రానికి,ప్రజలకు కేసీఆర్ పాలనయే శ్రీరామరక్ష అని,రక్షణ అని ఆయన స్పష్టం చేశారు.దేవుళ్లందరిపై రేవంత్ రెడ్డి ఒట్లేసినట్టుగానే తాను కూడా ఒట్టేసి చెబుతున్న కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని, ఇది సత్యం, జరిగి తీరుతుందని ఎంపీ వద్దిరాజు ధీమాతో చెప్పారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ సమీపాన ఎంపీ రవిచంద్ర వేలాది మందితో మానవహారం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను వివరిస్తూ 420 మీటర్ల భారీ బ్యానర్ తో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు గులాబీ కండువా ధరించి, జెండాలు చేతబట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.