Tatvam | టాలీవుడ్ యువ నటుడు దినేష్ తేజ్ మరియు దష్విక.కె ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వైవిధ్యమైన చిత్రం ‘తత్వం’. అర్జున్ కోలా దర్శకత్వం వహించిన ఈ సినిమాను త్రయతి ఇషాని క్రియేషన్స్ మరియు ఎస్.కే.ప్రొడక్షన్స్ పతాకాలపై శీమకుర్తి వంశీ కృష్ణ, శ్వేత పసుపులేటీ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మర్డర్ మిస్టరీ జానర్లో ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, చిత్ర హీరో దినేష్ తేజ్ మీడియాతో ముచ్చటించి సినిమా విశేషాలను పంచుకున్నారు.
సినిమా విడుదలకు సిద్ధమైన వేళ ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రంలో ఎవరూ ఊహించని మలుపులు, క్లైమాక్స్‌లో వచ్చే తీవ్రమైన భావోద్వేగాలు ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను పంచుతాయని తెలిపారు. మనుషుల నమ్మకాలకు, మూఢనమ్మకాలకు మధ్య ఉండే సన్నని గీత ఆధారంగా 2000వ సంవత్సరంలో నడిచే ఈ కథ అందరినీ ఆలోచింపజేస్తుందని ఆయన పేర్కొన్నారు.
సినిమా షూటింగ్ మరియు ప్రమోషన్ సమయంలో తమకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయని, ముఖ్యంగా తనకు మరియు హీరోయిన్‌కు యాక్సిడెంట్ జరగడం వంటి ఇబ్బందులు వచ్చినా, సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే తాము ముందుకు వెళ్లామని దినేష్ తేజ్ వెల్లడించారు. ఈ కష్టాలన్నీ తమ సినిమాకు దిష్టి తగిలినట్లుగా భావిస్తున్నామని, ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ సినిమాను ఆదరిస్తారనే పూర్తి విశ్వాసం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాకుండా, నటుడిగా తనకు పూర్తి సంతృప్తిని, ప్రేక్షకుల్లో మంచి గౌరవాన్ని తెచ్చిపెట్టే చిత్రమిదని తెలిపారు. ఈ సినిమా విజయం సాధిస్తే సరికొత్త కథలతో వచ్చే యువ దర్శకులకు, రచయితలకు తాను కూడా ఒక మంచి ఆప్షన్‌గా మారుతానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నటీనటులు, దర్శకుడు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని, ప్రేక్షకులు ఈ డిఫరెంట్ థ్రిల్లర్‌ను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరారు.