– చుంచుపల్లి ఎంపీడీఓ సుభాషినికి వినతి
చుంచుపల్లి, ఏప్రిల్ 28 : రుద్రంపూర్‌లో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించాలని కోరుతూ చుంచుపల్లి ఎంపీడీఓ సుభాషినికి విశ్వమాత మదర్ థెరిసా సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలైన ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ గృహాలు వంటి ప్రయోజనాలు అందలేదని, ఇళ్లకు నెంబర్లు కూడా ఇవ్వని నేపథ్యంలో రుద్రంపూర్‌లోని వివిధ వర్గాల ప్రజలు కలిసి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల ముఖ్యులు, మసీదు, చర్చి, ఆలయ కమిటీలు, తాపీ సంఘం, ఆటో సంఘం, వ్యాపార వర్గాలు, సీనియర్ సిటిజన్లు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని ఇల్లు ఇల్లు తిరిగి సుమారు 200 మంది ప్రజల సంతకాలు సేకరించారు. ఈ సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓ సుభాషినికి అందజేసి రుద్రంపూర్‌లో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించాలని కోరారు.
సింగరేణి సంస్థ ఆధారంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు భవిష్యత్‌లో సింగరేణి సంస్థ ఈ ప్రాంతాన్ని ఖాళీ చేస్తే తమ పరిస్థితి ఏమవుతుందనే ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రుద్రంపూర్, గౌతంపూర్, ధన్‌బాద్ గ్రామ పంచాయతీలకు సంయుక్తంగా మెగా గ్రామ సభ నిర్వహించాలని కోరారు. ఈ గ్రామ సభకు స్థానిక ఎమ్మెల్యే, చుంచుపల్లి తాసీల్దార్, డీపీఓ, 2 టౌన్ పోలీస్ శాఖ, సింగరేణి జీఎం, రాజకీయ నాయకులు, యూనియన్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మతపరమైన కమిటీలు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంఘాల ప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. గ్రామ సభలో ప్రజల సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేసే అవకాశం కల్పించి, అందరికీ ఆమోద యోగ్యమైన తీర్మానం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ అధ్యక్షుడు గూడెల్లి యాకయ్య, బోట్ల ప్రభాకర్, చింతల రాములు, యాదగిరి పాల్గొన్నారు.