ఇల్లెందు, మే 26 : పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై వెంటనే విచారణ చేపట్టి పరిష్కారానికి కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సిబ్బందికి సూచించారు. సోమవారం టేకులపల్లి పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అలాగే స్టేషన్ అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సీఐ సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు.