కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 29 : మే డేను పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డి కాంట్రాక్ట్ కార్మికుల జీతాల పెంపుపై ప్రకటన చేయాలని కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ నాయకుడు భూక్యా రమేశ్, పి.సతీశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలని ఈ నెల 30న సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం వివిధ ఏరియాల్లో కార్మికులను కలిసి మాట్లాడారు.
సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 30న కాంట్రాక్ట్ కార్మికుల ఒకరోజు నిరసన దీక్ష, మహాధర్నా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి పెంచనున్నట్లు తెలిపారు. సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల శ్రమను దోచుకుంటుందని, కోల్ ఇండియా ఒప్పందాలు సైతం అమలు చేయకుండా కాంట్రాక్ట్ కార్మికులను వెట్టిచాకిరికి గురిచేస్తుందని దుయ్యబట్టారు.
గత సమ్మె సందర్భంగా సింగరేణి యాజమాన్యం లేబర్ కమిషనర్ సమక్షంలో చేసుకున్న అగ్రిమెంట్‌ను సైతం అమలు చేయడం లేదని ఆరోపించారు. ఈ స్థితిలో సింగరేణి వ్యాప్తంగా మళ్లీ పోరాటం చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించినట్లు చెప్పారు. మహాధర్నాలో సింగరేణి వ్యాప్తంగా అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.