– టీబీజీకేఎస్ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ డిమాండ్
రుద్రంపూర్, జనవరి 21 : సీఎం పీఎఫ్ (CM PF కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్) కార్యాలయాన్ని కొత్తగూడెంలోనే కొనసాగించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ బహిరంగ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. సింగరేణి కార్మికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, తెలంగాణ ప్రాంతంలో బొగ్గు పుట్టిన ప్రాంతమైన కొత్తగూడెం–మణుగూరు పరిధిలో కార్మికులకు సులభంగా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం స్థలాన్ని కేటాయించి సీఎం పీఎఫ్ కార్యాలయాన్ని కొత్తగూడెంలో ఏర్పాటు చేయించిందని ఆయన గుర్తు చేశారు. అనంతరం ఆ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం కూడా జరిగిందన్నారు. అయితే, ప్రస్తుతం ఆ కార్యాలయాన్ని కొత్తగూడెం నుండి హైదరాబాద్కు తరలించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన అన్నారు.
ప్రభుత్వం కార్మికులకు అందుబాటులో ఉండే విధానాలపై దృష్టి పెట్టాలే తప్పా, ఒకరిద్దరి స్వలాభం కోసం కీలక కార్యాలయాన్ని తరలించడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్తగూడెం జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ ఉద్యోగులు, కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారని అందువల్ల సీఎం పీఎఫ్ కార్యాలయం ఇక్కడే కొనసాగితే వేలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. సింగరేణి యాజమాన్యంతో సమన్వయం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం సీఎం పీఎఫ్ కార్యాలయాన్ని కొత్తగూడెంలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.