రుద్రంపూర్, ఏప్రిల్ 30 : కొబ్బరి చెట్టు కాయలు పడి ఇళ్ల రేకులు పగలడమే కాకుండా పిల్లలకు గాయాలైన నేపథ్యంలో ప్రారంభమైన వివాదం చివరకు ఘర్షణగా మారి వ్యక్తులపై దాడికి దారితీసిన ఘటన బుధవారం అర్ధరాత్రి చుంచుపల్లి మండలం ధన్బాద్ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధన్బాద్ పంచాయతీ పరిధిలో నివసిస్తున్న గుంటి భాస్కర్ కుటుంబం పక్కనే ఉన్న పూల రవీందర్ ఇంటి వద్ద ఉన్న కొబ్బరి చెట్టు కాయలు తరచుగా పడి భాస్కర్ ఇంటి పైకప్పు రేకులు పగలడమే కాకుండా ఇంట్లో ఉన్న పిల్లలకు గాయాలు కావడంతో చెట్టును తొలగించాలని గత కొన్ని రోజులుగా ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదాలు కొనసాగుతున్నాయి.
ఈ విషయంపై ఇరువురు కుటుంబాలు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇటీవల కొత్తగూడెం డీఎస్పీ ఆధ్వర్యంలో ఇరువురికి కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. అయితే బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో పూల రవీందర్, నాగరాజు, అనిల్, జీవన్, కార్తీక్ అనే వ్యక్తులు గుంటి భాస్కర్ ఇంట్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా దాడి చేయడంతో భాస్కర్ తలకు తీవ్ర గాయాలు కాగా, రుంజ అభిలాష్, గుంటి లక్ష్మి కూడా గాయపడ్డారు. రుంజ అభిలాష్ ఫిర్యాదు మేరకు టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి. ప్రతాప్, సబ్ ఇన్స్పెక్టర్ కిశోర్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ కిశోర్ తెలిపారు.