ఇల్లెందు, మార్చి 16 : చలో హైదరాబాద్కు వెళ్తున్న అంగన్వాడీలను, రాష్ట్ర నాయకత్వాన్ని అర్ధరాత్రి ముందస్తు అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఇల్లెందులో సీఐటీయూ నాయకులు సోమవారం నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. ఐసిడిఎస్ వ్యవస్థను బలపర్చాలని, బడ్జెట్లో నిధులు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టిన రూ.18 వేల వేతనం చెల్లించాలని, వేసవి సెలవులు ఇవ్వాలని తదితర డిమాండ్లతో నేడు హైదరాబాద్ ఇందిరాపార్క్ కు బయల్దేరుతున్న అంగన్వాడీ టీచర్లను, రాష్ట్ర నాయకత్వాన్ని, ప్రధాన కార్యదర్శి జయలక్ష్మిని అర్ధరాత్రి అరెస్టు చేసి నిర్బంధించడం హేయమైన చర్య అన్నారు.
దానికి నిరసనగా ఇల్లెందు పురవీధుల్లో సిఐటియు ప్రదర్శన నిర్వహించి, జగదాంబ సెంటర్ నందు మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈసం వెంకటమ్మ, అబ్దుల్ నబీ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఎక్కడికక్కడ మంత్రులకు ఈ బడ్జెట్ సమావేశాలలో అంగన్వాడీ వ్యవస్థను బలపరిచే విధంగా బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు.
అందులో భాగంగా సోమవారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద అంగన్వాడీలు పెద్ద ఎత్తున సభ నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, స్త్రీ శిశు సంక్షేమ మంత్రికి వినతి పత్రాలు ఇచ్చేందుకు కార్యచరణ తీసుకోగా నిన్నటి నుండే ఎక్కడికక్కడ పోలీసులు అంగన్వాడీ టీచర్లను అర్ధరాత్రి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో ఉంచడం సరికాదన్నారు. తాము ప్రజాస్వామ్య పద్ధతుల్లో సభ నిర్వహణ కోసం హైదరాబాద్ పోలీస్ పర్మిషన్ తీసుకున్నప్పటికి అరెస్టు చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ఈ సభలో జిల్లా నాయకులు ఎస్కే ఫాతిమా, బత్తుల దేవేంద్ర, చింత రాంబాయి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్.సుశీల, పి.వెంకటమ్మ, ఈ.రమకుమారి, సరిత, రేణుక, సమత, వెంకటలక్ష్మి, శారద పాల్గొన్నారు.

అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఇల్లెందులో సీఐటీయూ నిరసన ర్యాలీ