రామవరం, జనవరి 14 : సంక్రాంతి పండుగ అంటే పందెంలో కోడి మెడ తెగాలి, లేకపోతే చైనా మాంజాతో వాహనదారుల మెడ తెగాలి అన్నట్టుగా ఉంది పరిస్థితి. పండుగ వచ్చిందని సంతోషపడాలా లేక బయట అడుగుపెడితే ఏమవుతుందో అని ఆందోళన పడాలో తేలని వ్యవహారం. ఇటీవల కాలంలో ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు చైనా మాంజాలు మృత్యు పాశాలుగా మారుతున్నాయి. నిషేధం ఉన్నప్పటికీ చట్టాన్ని లెక్కచేయని కొందరు వ్యాపారులు చైనా మాంజా అమ్మకాలను కొనసాగిస్తూ పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
చైనా మాంజా అమ్మకాలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కఠిన చర్యలకు ఆదేశించినా క్షేత్రస్థాయిలో పకడ్బందీ కార్యాచరణ కనిపించకపోవడంతో ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలే స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడటం కన్నా, ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్న ఆలోచనతో చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీకి చెందిన పలువురు బైకర్లు హెల్మెట్‌తో పాటు మెడకు రుమాలు చుట్టుకుని ప్రయాణిస్తూ తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.