- కన్నీరుమున్నీరవుతున్న రైతులు
– రూ.1.5 లక్షల మేర నష్టం
జూలూరుపాడు, మే 05 : ఆరుగాలం శ్రమించి, కన్నబిడ్డల్లా సాదుకున్న పాడి పశువులను విద్యుత్ రూపంలో మృత్యువు కబళించింది. ఆ ఇద్దరు రైతుల జీవనాధారం తెగిపడిన విద్యుత్ తీగల రూపంలో చితికిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రాజారావుపేట గ్రామంలో మంగళవారం వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. రాజారావుపేట గ్రామానికి చెందిన రైతులు ముళ్లపాటి దుర్గయ్య, పొన్నెబోయిన నరేష్‌కు చెందిన రెండు తెల్ల పశువులు సోమవారం ఉదయం మేత కోసం శివారు పొలాల్లోకి వెళ్లాయి. అయితే, గ్రామ సమీపంలోని ఓ పొలంలో విద్యుత్ ఇన్సులేటర్ తెగిపోయి, హైటెన్షన్ తీగలు ప్రమాదకరంగా కిందకు వేలాడుతున్నాయి.
మేత మేస్తూ అటుగా వెళ్లిన పశువులు ఆ తీగలను తాకడంతో ఒక్కసారిగా విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మృతి చెందిన పశువుల విలువ సుమారు రూ.1.5 లక్షల వరకు ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా వేలాడుతున్న తీగలకు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా బాధిత రైతులు వేడుకొంటున్నారు.