జూలూరుపాడు, మే 28 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నరసాపురం గ్రామ సమీపంలో వాహన తనిఖీల్లో సుమారు రూ. 4.15 కోట్ల విలువ చేసే 830 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బుధవారం జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వివరాలను వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు జులూరుపాడు పోలీసులు, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో HRSSAH7375 నంబర్ గల ఐషర్ వ్యాస్ (డీసీఎం) ను తనిఖీ చేయగా గంజాయిని గుర్తించినట్లు చెప్పారు. దీని విలువ సుమారు రూ.4,15,27,000గా తెలిపారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం బెండ్ జిల్లా హతర్కరి గ్రామానికి చెందిన జస్రం, అదే జిల్లాలోని భరై గ్రామానికి చెందిన రామ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వ్యానుకు వెనుక భాగంలో అనుమానం రాకుండా ఒక ప్రత్యేకమైన అర తయారు చేసి అందులో గంజాయిని ప్యాకెట్ల రూపంలో పెట్టి అక్రమ రవాణా చేస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో తులసిపాక గ్రామం నుండి గంజాయిని లోడ్ చేసుకుని భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నట్లు తెలిపారు. అమ్మకం, కొనుగోలు, రవాణా చేస్తున్న మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు, డీసీఎం వ్యాన్, రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. పరారీలో ఏడుగురు వ్యక్తులు ఉన్నట్లు చెప్పారు.
2024లో 112 కేసుల్లో 8,078 కేజీలు, 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు 3,002 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాను సమర్ధవంతంగా అడ్డుకుని నిందితులను దాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ రవి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్ఐ ప్రవీణ్ ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Julurupadu : రూ.4.15 కోట్ల విలువైన గంజాయి పట్టివేత