టేకులపల్లి, జనవరి 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బోడు పరిసర ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సిగ్నల్ సేవలు మెరుగు పర్చాలని బోడు గ్రామస్తులు, సర్పంచ్ పొదెం స్వరూప కోరారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎనిమిది సంవత్సరాలుగా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఇబ్బందికరంగా ఉందన్నారు. నెట్వర్క్ మెరుగుపర్చాలని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదన్నారు. కనీసం కాల్స్ మాట్లాడే పరిస్థితి లేదని, ఇంటర్నెట్ సదుపాయం అధ్వానంగా ఉందన్నారు. బోడు చుట్టూ పక్కల గ్రామాల్లో వేలాది మంది బీఎస్ఎన్ఎల్ వినియోదారులు ఉన్నారని, ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించాలని కోరారు.