బూర్గంపహాడ్, జనవరి 22: సారపాక ఐటీసీ పీఎస్పీడీలో ఈ నెల 31న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్టీయూ మిత్రపక్షాలదే గెలుపు అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. స్థానిక బీఆర్టీయూ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్టీయూ మిత్రపక్షాలు 14వ వేతన ఒప్పందం కోసం 14 అంశాలను మ్యానిఫెస్టోలో ప్రవేశపెట్టి విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయన్నారు. నిబద్ధత, నిజాయితీతో కార్మికుల సంక్షేమం కోసం పాటుపడే సంఘం బీఆర్టీయూ అని అన్నారు.
ప్రధానంగా విద్య, వైద్యం, బదిలీల రెగ్యులర్, క్వార్టర్ల నిర్మాణంతో కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే సంఘం ఏదైనా ఉందంటే అది బీఆర్టీయూ మాత్రమేనన్నారు. త్వరలో జరగనున్న ఐటీసీ గుర్తింపు ఎన్నికల్లో రామబాణంలా బీఆర్టీయూ మిత్రపక్షాలు దూసుకెళ్లి విజయం సాధించడం తథ్యమన్నారు. తొలుత బీఆర్టీయూ ఎన్నికల ప్రచార రథాలను రేగా జెండా ఊపి ప్రారంభించారు. విలేకరుల సమావేశం అనంతరం మ్యానిఫెస్టోను విడుదల చేసి.. బీఆర్టీయూ మిత్రపక్షాలు, కార్మికులతో సమావేశం నిర్వహించారు.
ఎన్నికల్లో గెలుపుపై చర్చించారు. సమావేశంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము శంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్కే అజీమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ డి.హరినాథ్, సీఐటీయూ అధ్యక్షుడు కె.ప్రవీణ్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, ఐఈయూ ప్రధాన కార్యదర్శి ఎండి.సాబీర్, ఐఈయూ అధ్యక్షుడు శిక్షావలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆర్గనైజేషన్ బాధ్యులు నర్సింహారావు, డి.ప్రశాంత్, బహుజన నాయకులు మధుమహరాజ్, శ్రీపాద రవికుమార్, గద్దల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీనివాస్, బెజ్జంకి కనకాచారి, బొల్లు సాంబ, బిట్రా సాయిబాబా, ఖాదర్, పూర్ణ, లక్ష్మీచైతన్యరెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు.