బూర్గంపహాడ్, మే 12 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను పోక్సోకేసులో తక్షణమే అరెస్టు చేయాలంటూ బీఆర్ఎస్ సారపాక శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. మంగళవారం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపు మేరకు బూర్గంపహాడ్ మండలం సారపాక బీఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు కొనకంచి శ్రీను ఆధ్వర్యంలో సారపాక ప్రధాన సెంటర్ లో బీఆర్ఎస్ నాయకులు నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన బండి భగీరథ్‌ను అరెస్టు చేయకుండా ప్రభుత్వం, పోలీసులు తాత్సారం చేస్తున్నారని, సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఇంతవరకు అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమారుడు ఇలాంటి సిగ్గుమాలిన పనిచేయడం పట్ల మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తుందన్నారు. తక్షణమే బండి బగీరథ్ను అరెస్టు చేయాలని, అదేవిధంగా తన కుమారుడి చర్యలకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ కూడా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్, మహిళా నాయకులు, బీఆర్టీయూ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.