– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హరిసింగ్ నాయక్
ఇల్లెందు, జనవరి 27 : ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు హరిసింగ్ నాయక్ మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇల్లెందు పట్టణంలో పలు వార్డుల్లో వార్డు ముఖ్య నాయకులతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు. రెండు సంవత్సరాలుగా పట్టణాలను సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్.. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఇల్లెందు ఓటర్లను ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. రెండు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా పట్టణాలకు ఇవ్వని ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. రెండు సంవత్సరాల్లో ఇల్లెందు మున్సిపాలిటీకి ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజీబీకేఎస్ నాయకులు రంగనాథ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ జబ్బర్, ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, పట్టణ ఉపాధ్యక్షులు అబ్దుల్ నబీ, పాలడుగు రాజశేఖర్ పాల్గొన్నారు.