రామవరం, మార్చి 25: భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, న్యాయవాది జీకే సంపత్ కుమార్ వాహనాన్ని దుండగులు దగ్దం చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఇంటి ముందు నిలిపిఉంచిన కారుపై దాడిచేసిన గుర్తుతెలియని వ్యక్తి దానికి నిప్పంటించాడు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం సుభాష్ చంద్ర బోస్ నగర్‌లోని తన ఇంటి ముందు పార్కు చేసి ఉన్న కారును గుర్తుతెలియని వ్యక్తి తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో దగ్ధం చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనబడుతుందని సంపత్ కుమార్ తెలిపారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై పోరాటం చేస్తున్న నేపథ్యంలో అధికారుల చెంచాలు ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి చిల్లర బెదిరింపులకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.