– డీఎంఎఫ్ నిధులను నియోజకవర్గ అభివృద్ధికే కేటాయించాలి
– ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ముట్టడికి ప్రయత్నం
– అడ్డుకున్న పోలీసులు
కొత్తగూడెం అర్బన్, నవంబర్ 7 : కాంగ్రెస్ ప్రభుత్వం ‘ ప్రజా పాలన’ అంటూ మాటలకే పరిమితమై ప్రజలను అనేక ఇబ్బందుకు పెడుతుందని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు బండి రాజు గౌడ్ అన్నారు. నియోజకవర్గంలోని రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి రైటర్ బస్తీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు నాయకులు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బండి రాజు గౌడ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) నిధులను సద్వినియోగం చేసుకోవడంలో ప్రజా ప్రతినిధి విఫలమయ్యారన్నారు.
నియోజకవర్గంలో రోడ్లకు మరమ్మతులు చేసే దిక్కు లేదని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఇక్కడి డీఎంఎఫ్ నిధులను వేరే ప్రాంతాలకు కాంగ్రెస్ నాయకులు తరలించుకు పోతున్నప్పటికీ స్థానిక ప్రజా ప్రతినిధి పట్టనట్టు ఉండటం సరికాదన్నారు. ప్రజా పాలన, అభయ హస్తం అంటూ సీఎం రేవంత్ రెడ్డి పాలన ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి సమస్యలు పరిష్కరించి వెంటనే రోడ్లకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు సింధు తపస్వి, జయరాం, చందూ నాయక్, యూత్ విభాగం పట్టణాధ్యక్షుడు పోతురాజు రవి, ఎస్కే షరీఫ్, గుమ్మడి సాగర్ పాల్గొన్నారు.

Kothagudem Urban : రోడ్లకు మరమ్మతులు చేయాలని బీఆర్ఎస్ కొత్తగూడెం నాయకుల నిరసన