‘ప్రగతిభవన్ ముందున్న ఇనుప కంచెను తొలిగించాం. 4 కోట్ల తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా లోనికి వచ్చేలా గేట్లు బార్లా తెరిచాం’ ఇదీ సీఎంగా ప్రమాణం రోజు రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన. ప్రగతిభవన్ ముందు కంచెలు కూడా కాంగ్రెస్ కట్టించిందేనని తెలిసీ అబద్ధమాడిన ఆయన.. ఇప్పుడు తన కొత్త ‘క్యాంప్ ఆఫీస్’ చుట్టూ కంచెలు నాటుకుంటున్నారు. దుర్భేద్య కోటగా మార్చేందుకు ఏకంగా రూ.9 కోట్లతో టెండర్లు పిలిచారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ‘ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడుతాం’ అనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నినాదంగా కూడా ఉండేది. వాస్తవానికి ఇప్పుడు ప్రజాభవన్ ఉన్న స్థానంలోనే ఉమ్మడి రాష్ట్రంలో సీఎం క్యాంప్ కార్యాలయం ఉండేది. వైఎస్సార్ అందులోనే ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి కూడా దానిలోనే కొనసాగారు. ఆయన హయాంలోనే భవన్ చుట్టూ ముండ్ల కంచె ఏర్పాటుచేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ అక్కడే సీఎం క్యాంప్ ఆఫీస్‌ను నిర్మించి, ప్రగతి భవన్ అని పేరు పెట్టి, అందులోనే నివాసం ఉన్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అది ప్రభుత్వ భవనం అనే విషయాన్ని కూడా ప్రజలు మరచిపోయే స్థాయిలో ప్రగతి భవన్‌ను ‘గడి’గా వర్ణించి, దుష్ప్రచారం చేశారు.
2023 డిసెంబర్ 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రగతి భవన్ ముందున్న కంచెను తొలగించారు. ప్రజాభవన్‌గా పేరు మార్చారు. అయితే.. కంచె, భద్రత లేని నివాసం తనకెందుకని అనుకున్నాడేమో.. సీఎంగా ఆ ప్రజా భవన్లో ఆయన ఒక్కపూట కూడా నివాసం ఉండలేదు. కనీసం తన అధికారిక క్యాంపు కార్యాలయంగా కూడా పెట్టుకోలేదు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-25లోని పెద్దమ్మగుడి సమీపంలో ఉన్నతన ప్యాలెస్‌కే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకొన్నారు. మూడంచెల పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసుకొన్నారు. సాధారణ ప్రజలు కాదు కదా.. కనీసం ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య లాంటి వారికి కూడా ప్రవేశం లేనంత కట్టుదిట్టం చేశారు.
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంసీఆర్హెచ్చార్డీపై కన్నేశారు. తన నివాసానికి వెనుకాలే ఉన్న ఈ ఎంసీఆర్హెచ్చార్డీని క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని ప్రయత్నించారు. 33 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎంసీఆర్‌హెచ్చార్డీ ప్రాంగణం సర్వహంగులతో ఉన్నది. ఒకేసారి దాదాపు 150 మంది చొప్పున కూర్చునేందుకు వీలుగా 4 కాన్ఫరెన్స్ హాళ్లు, బోర్డు రూం, 250 మంది కూర్చునే ఆడిటోరియం, అతిథులకు ఆశ్రయం ఇవ్వడానికి మంజీర, కృష్ణ, గోదావరి, తుంగభద్ర పేర్లతో విడివిడి బ్లాకులు ఉన్నాయి. సెక్యూరిటీ పరంగానూ చీమలు దూరనంత పటిష్టంగా ఉండటంతో క్యాంపు కార్యాలయంగా చేసుకోవాలని చూశారు. అయితే.. ప్రగతి భవన్ రేవంత్‌రెడ్డి హంగూ, ఆర్భాటాలకు సరిపోదని, 33 ఎకరాల భవన సముదాయాల్లోకి మారుతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సీఎం అప్పట్లో తన అభిప్రాయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. తాజాగా మళ్లీ ఇదే ప్రాంగణాన్ని తన క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
‘ఎంసీఆర్‌హెచ్చార్డీ వీవీఐపీ గెస్టహౌస్ చుట్టూ బలిష్టమైన గోడ కట్టాలి. ఇనుప కంచెలు ఏర్పాటు చేయాలి. ఎత్తయిన వాచ్ టవర్లు, దుర్భేద్యమైన కంటైనర్లు పెట్టాలి. లోహపు గేట్లు, విదేశీ ఫర్నిచర్.. ఇలా భద్రతా ప్రమాణాలు ఇంచు కూడా తగ్గకుండా పనులు చేసే కాంట్రాక్టర్లు కావలెను. 24 నెలల్లోపు పని పూర్తి చేయవలెను’ ఇది ఈ నెల 13న ఆర్ అండ్ బీ హెడ్‌క్వార్టర్స్ సూపరింటెండింగ్ జారీచేసిన ప్రకటన. ఈ వీవీఐపీ గెస్ట్‌హౌస్ ఎవరి కోసం? ప్రధానమంత్రో, రాష్ట్రపతితో విడిదికి వస్తున్నారా? అనుకుంటే పొరపాటే. ఈ గెస్ట్‌హౌస్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన క్యాంపు ఆఫీసుగా మార్చుతున్నారని సచివాలయంలో చర్చ జరుగుతున్నది.
సీఎం క్యాంపు ఆఫీస్‌లోకి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మాత్రమే కాదు, చీమ, పిట్ట లాంటి జీవరాశి కూడా దూరలేనంత భద్రతా ప్రమాణాలతో రాజసౌధం తరహాలో తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించారని అంటున్నారు. వీవీఐపీ గెస్ట్‌హౌస్ కోసం అప్రోచ్ ర్యాంప్, వెస్ట్‌సైడ్ రోడ్, ఫ్లోరింగ్‌తోపాటు కాంపౌండ్ వాల్, కంటైనర్లు, వాచ్టవర్లు, గేట్లు, ఫర్నిచర్ తదితర పనుల కోసం రూ.9.08 కోట్లు నిధులు కేటాయించారు. ఈ నెల 18తో టెండర్ల దాఖలు గడువు కూడా ముగిసింది. వచ్చే నెల 4, 6 తేదీల్లో ఆ బిడ్లు తెరువనున్నారు. నేనే రాజు.. నేనే మంత్రి అంటూ ప్రకటించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి అందుకు తగ్గట్టుగానే రాచరిక పోకడలను అనుసరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వీవీఐపీ గెస్ట్‌హౌస్‌కు సమీపంలో ఇప్పటికే రూ.5 కోట్లు ఖర్చుచేసి ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను నిర్మించారు. ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన మనమడు మాత్రమే ఆడుకుంటారని, ఇందులోకి ఆయన అతి సమీప బంధువులకు మినహా ఇతరులకు ప్రవేశం లేదన్న విమర్శలు ఉన్నాయి. గెస్ట్‌హౌస్ నుంచి ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు, ప్లే గ్రౌండ్ నుంచి సులువుగా బయటకు వెళ్లడానికి వీలుగా విశాలమైన రోడ్లు ఉన్నాయి. ఎంసీఆర్‌హెచ్చార్డీ అంటేనే శత్రుదుర్భేద్యమైన ప్రాంగణం. రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శుల స్థాయి వారు ఇందులో బస చేశారు. అయినా ఈ రోడ్లు కాదని, ఇటీవల రెండు కొండలను తవ్వించి ప్రత్యేక రోడ్డు వేస్తున్నారు. దీని కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో వివరాలు వెల్లడించడం లేదు. ఈ రోడ్డు ద్వారా కేవలం సీఎం రాకపోకలను మాత్రమే అనుమతిస్తారని చెప్తున్నారు.