హనుమకొండ, ఫిబ్రవరి 23 : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఆరోపించారు. ఉద్యమ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ రెండున్నరేండ్లు టైంపాస్ చేసిందని విమర్శించారు.
సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, తాటికొండ రాజయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటి అమలును మరిచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని ధ్వజమెత్తారు.
బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాడుతున్నామని, జనతా గ్యారేజ్ లాగా బీఆర్ఎస్ కార్యాలయాలు పని చేస్తున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టులో 90 శాతం పనులు పూర్తిచేసిందని, మిగిలిన 10 శాతం పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేయలేక పోయిందని విమర్శించారు. దేవాదులపై కాంగ్రెస్ సర్కారు వాయిదాలు వేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు జోకర్‌ను తలిపిస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ఎద్దేవా చేశారు.