జూలూరుపాడు, అక్టోబర్ 15 : బీసీ రిజర్వేషన్‌పై బీజేపీకి చిత్తశుద్ధి లేదని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బి.వెంకట్ అన్నారు. బుధవారం జూలూరుపాడు మండలంలో ఆయన పర్యటించారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన ఏసీపీ విష్ణుమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. విష్ణుమూర్తి తన చిన్ననాటి మిత్రుడని, ఆయన మరణం తీరని లోటని అన్నారు. అనంతరం సీపీఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచడంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్ ప్రతిపాదన వచ్చినా పార్లమెంట్లో చట్టం చేయకుండా మోదీ ప్రభుత్వం అడ్డుపడుతోందన్నారు. బీజేపీ నిజంగా బీసీల పక్షాన ఉంటే రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు.
జీఎస్టీ వ్యవస్థ వల్ల ప్రజలపై పన్ను భారం పెరిగిందని, బీజేపీ ప్రభుత్వం స్లాబులు తగ్గించాం అనే పేరుతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. జీఎస్టీని రెండు స్లాబులుగా కుదించామని చెబుతున్నారు కానీ అసలు భారమే తగ్గలేదన్నారు. ప్రజలపై పక్షపాత దృష్టి ఉంటే మొత్తం జీఎస్టీనే ఎత్తివేయాలన్నారు. విద్యుత్ రెగ్యులేటరీ బిల్లుతో దేశంలోని విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వాలని కేంద్రం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. అంబానీలు, అదానీలకు దేశ సంపదను అప్పగించే ప్రయత్నం ఇది అని సామాన్య ప్రజలకు లభిస్తున్న ఉచిత విద్యుత్‌ను తొలగించడమే ఈ బిల్లుతో అసలు ఉద్దేశం అని తెలిపారు. ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం వల్ల గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిరుద్యోగం పెరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాలకు నిధులు పెంచితే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని, పరిశ్రమలకు ఉత్సాహం వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రైతులకు యూరియా కొరతను కేంద్రం కావాలనే సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తేనే వ్యవసాయం నిలదొక్కుకుంటుందన్నారు. నవంబర్ 26న దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో ఉపాధి, జీఎస్టీ రద్దు, రైతు ఎంఎస్పీ, విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ నిరసన, దిగ్భంధాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను బహిర్గతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి యాసా నరేశ్, కమిటీ సభ్యులు గార్లపాటి వెంకటి, వలమల్ల చందర్రావు, బోడ అభిమిత్ర, పార్టీ శాఖ కార్యదర్శి బొల్లి లక్ష్మయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.