జూలూరుపాడు, ఏప్రిల్ 16: రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు ఊరూ వాడా.. ఓరుగల్లు బాట పట్టాలని వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ సన్నాహక సమావేశం మండల కేంద్రంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా బహిరంగ సభ వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 14 ఏండ్లు పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించి.. అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
ప్రజలు అడగని పథకాలను కూడా ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేశారని గుర్తు చేశారు. రజతోత్సవ సభకు ప్రతీ పల్లె నుంచి భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఉద్యమకారులు, అభిమానులు, ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాలు తరలివచ్చేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు యదళ్లపల్లి వీరభద్రం, దుద్దుకూరి నాగేశ్వరరావు, మూడు చిట్టిబాబు, హరిలాల్, బోజ్యానాయక్, బాలాజీ, రాములు తదితరులు పాల్గొన్నారు.