రుద్రంపూర్, మే 01 : స్థానిక జిల్లా కేంద్రంలోని రామవరంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జిల్లా సంక్షేమ అధికారిణి జె.స్వర్ణలత లేనినా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి “బాల భరోస” కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా, వారి ఎదుగుదలలో తలెత్తే లోపాలను తొలి దశలోనే గుర్తించి నివారించేందుకు 99 రోజుల ప్రజా ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బాల భరోసా’ కార్యక్రమం జిల్లా మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గతవారం రోజులుగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా ముఖ్యంగా సున్నా నుండి ఐదు సంవత్సరాల లోపు చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని, పిల్లల్లో ఉండే,న్యూరో డెవలప్మెంట్ (నాడీ వ్యవస్థ సంబంధిత) సమస్యలు, శారీరక ఎదుగుదల లోపాలు, మానసిక వికాసంలో ఆలస్యం వంటి అంశాలను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా వారికి మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుందని, దానికి అనుగుణంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేసి ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి భాగస్వామ్యం కావాలన్నారు.
బాల భరోస కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సకాలంలో జోక్యం అని పిల్లలలో ఏవైనా లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే, వెంటనే వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స ప్రారంభించి, ఆ సమస్య తీవ్రతరం కాకుండా చూడాలన్నారు. ప్రతి చిన్నారి శారీరక, మానసిక స్థితిని నిశితంగా పరిశీలించి, అవసరమైన వారికి ప్రత్యేక వైద్య సేవలు అందించడం. చిన్నారులు ఆరోగ్యంగా, సంతోషంగా పెరిగేలా చూడటమే కాకుండా, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్నారు. అదేవిధంగా జిల్లా సంక్షేమ అధికారిణి జె.స్వర్ణలత లేనినా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 2061 కేంద్రాలలో నమోదైన సున్నా నుండి ఐదు సంవత్సరాల లోపు అంగన్వాడీ కేంద్రాలలో నమోదైన పిల్లలను ఆర్బిఎస్కే టీముల ద్వారా ముందస్తు అనారోగ్య గుర్తింపులో భాగంగా న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం ద్వారా జిల్లాలో ఉన్న 60,000 మంది చిన్నారులను 42 ప్రశ్నల ద్వారా ఆన్లైన్ పోర్టర్లలో వివరాలను నమోదు చేయడం జరిగిందని, దానికి అనుగుణంగా పిల్లల అభివృద్ధిలో వెనకడుగు, న్యూరో డెవలప్మెంట్, శారీరక లోపాలు ఉన్న పిల్లలను గుర్తించి ఈరోజు జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో ప్రత్యేక పర్యవేక్షణతో కూడిన పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ఈ ఒక్క అవకాశాన్ని సద్వినియోగం ఈరోజు మాత్రమే చేసుకోకుండా సూచించిన తేదీలలో క్రమం తప్పకుండా ఆరోగ్యపరీక్షలు నిర్వహించుకోవాలని, అంగన్వాడీ టీచర్లను సకాలంలో జోక్యం చేసుకొని స్థానిక ప్రాథమిక వైద్య కేంద్రాలలో చికిత్స అందించి పిల్లల సంపూర్ణ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.
ప్రతి చిన్నారి ఆరోగ్యంగా, సంతోషంగా, సురక్షితమైన భవిష్యత్‌ను నిర్మించే బాధ్యత మన అందరిపై ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ 0 నుండి 5 సంవత్సరాల పిల్లలు అందిస్తున్న సేవలను మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని సిబ్బందిని అడిగి తెలుసుకుని మెరుగైన సేవలు అందించాలని, మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని ప్రతి విభాగాన్ని పరిశీలించి సూచనలు జారీ చేయడం జరిగింది. తదుపరి “బేటి బచావో” కార్యక్రమంలో భాగంగా “భేటీ జన్మోత్సవ్”నిర్వహించి నెలలోపు జన్మించిన ఆడపిల్లలకు బేటి జన్మోత్సవ్ కిట్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది డాక్టర్ ప్రతాప్, డాక్టర్ వినోద్, నాగభూషణం, పీడియాట్రిషన్ డాక్టర్లు, జిల్లా స్థాయి ఆర్బిఎస్కే సిబ్బంది, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ జిల్లా సమన్వయకర్త పి.సంపత్, సిడిపిఓలు లక్ష్మీ ప్రసన్న, వెంకటరమణ, సూపర్వైజర్లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

ఉజ్వల భవిష్యత్‌కు ‘బాల భరోసా’ ఒక వరం : కలెక్టర్ అంకిత్