టేకులపల్లి, జనవరి 13 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో టేకులపల్లి, బోడు గ్రామాల్లో ‘అరైవ్ అలైవ్’ ప్రోగ్రామ్‌లో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను టేకులపలి సీఐ బత్తుల సత్యనారాయణ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వాప్తంగా ప్రారంభించిన ‘అరైవ్ అలైవ్’ ప్రోగ్రామ్ రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్న ముఖ్యమైన చర్యగా పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు దెబ్బతింటాయని, ప్రతి రోజూ జరుగుతున్న ప్రమాదాలను గుర్తు పెట్టుకుని ప్రజల్లో భద్రతపై అవగాహన తప్పనిసరి పెరగాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే ఈ ప్రమాదలకు కారణాలని చెప్పారు.
ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పడిన చోట ప్రమాదాన్ని చూసిన వెంటనే సహాయం చేసే వారికి పోలీసులు ప్రోత్సహాకాలు అందిస్తున్నట్లు తెలిపారు. యువతలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందిచడమే కాకుండా ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిన అవసరాన్ని కూడా స్పష్టంగా తెలియజేశారు. ఈ సదస్సులో గతంలో రోడ్డు ప్రమాదాల్లో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులు పాల్గొని తమ ఆవేదనను పంచుకున్నారు. అందరితో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బోడు ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.