రుద్రంపూర్, జూలై 13 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఇటీవల పెరుగుతున్న దొంగతనాలను అరికట్టేందుకు సెక్యూరిటీ విభాగం చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా సోమవారం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ఎస్ఆర్టీ ప్రాంతంలో ఎస్ అండ్ పి సి (S&P.C) సిబ్బంది దాడులు నిర్వహించారు. సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్ ఆదేశాల మేరకు జమీందారు జయరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో, కొందరు వ్యక్తులు సుమారు 20 అడుగుల పొడవు గల పైపులను ముక్కలుగా కోస్తుండగా గుర్తించారు. ఘటనాస్థలిలోని పైపులతో పాటు వాటిని కోయడానికి ఉపయోగిస్తున్న కట్టింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని గమనించిన నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారని, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతడిని ఎస్ అండ్ పి సి కార్యాలయానికి తరలించిన అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో స్పెషల్ పార్టీ గార్డ్ వెంకటేశ్వర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఈశ్వర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
గంజాయి, గుడంబాకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న యువత ఇటీవల కాలంలో రుద్రంపూర్ ప్రాంతంలో గంజాయి, గుడంబాకు అలవాటు పడిన యువత దొంగతనాలకు పాల్పడుతున్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని సింగరేణి ఖాళీ క్వార్టర్లను లక్ష్యంగా చేసుకొని అందులోని ఇనుప సామాను, ఇంటిపై ఉండే వాటర్ ట్యాంకులు, ఇళ్లలో ఉండే వైరింగ్ తొలగించి వచ్చిన డబ్బుతో మాధక ద్రవ్యాల మత్తులో ముగుతున్నారు. రుద్రంపూర్ లోని మసీదు దగ్గరలో ఉండే రెండు ఇండ్లలో విపరీతంగా గుడుంబా అమ్మకాలు చేస్తున్నప్పటికీ స్థానికులు ఆందోళన చేసి ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారి పైన చర్యలు తీసుకోవడం లేదని రూ.10, రూ.20కు గుడుంబా పోయడంతో బానిసలుగా మారిన చాలామంది దొంగతనాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు అంటున్నారు ఇప్పటికైనా ప్రొభిషన్ అండ్ ఎక్సైజ్, పోలీస్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తే బాగుంటుందని మహిళలు కోరుతున్నారు.