రామచంద్రాపురం, ఆగస్టు 6 : లహరి రిసార్ట్‌కు రోడ్డు కోసం భూమి ఇచ్చిన రైతునే మోసం చేయడం సరికాదని భూ యజమాని కరికె సత్యనారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. రిసార్ట్ యజమాని హరిబాబు తన రెండెకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ పలువురు గ్రామస్తులతో గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూర్ గ్రామంలోని తన భూమి వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సత్యనారాయణ మాట్లాడుతూ 2004లో లహరి రిసార్ట్‌కు రోడ్డు కోసం తన భూమిని విక్రయించాలని యజమాని హరిబాబు పలుమార్లు కోరడంతోపాటు అప్పటి మంత్రులతో చెప్పించడంతో అంగీకరించానని తెలిపారు. ఆ మేరకు తనకున్న 12.10 ఎకరాల్లో సర్వే నంబర్ 137, 138లోని రెండు ఎకరాల భూమిని విక్రయించానని పేర్కొన్నారు. మిగిలిన భూమిలో 22 ఏండ్లుగా తాను వ్యవసాయం చేస్తుండగా, ఇటీవల లహరి రిసార్ట్ వ్యక్తులు రాత్రికిరాత్రి తమ భూమిలోకి వచ్చి పిలర్లు వేశారని, ఇదేందని ప్రశ్నిస్తే డాక్యుమెంట్ ప్రకారమే వేస్తున్నామని సమాధానం ఇచ్చారని చెప్పారు. గతంలో రోడ్డు కోసం భూమి అడిగితే ఎక్కువ డబ్బులు తీసుకొని అమ్మారని, అందుకే ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్నామని లహరి యజమాని హరిబాబు చెబుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. తాను రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లో వాళ్లకు అనుకూలంగా పెన్నుతో బౌండరీలు రాసుకొని, వంద ఫీట్ల రోడ్డు ఉన్నట్టు మార్కింగ్ వేసుకున్నారని ఆరోపించారు. 2004లో ఇక్కడ వంద ఫీట్ల రోడ్డే లేదని, డాక్యుమెంట్లో ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తాము రోడ్డు కోసం భూమిని అమ్మినట్టు గ్రామస్తులందరికీ తెలుసుని చెప్పారు.
సత్యనారాయణ నుంచి లహరి రిసార్ట్ వాళ్లు 2004లో కొనుగోలు చేసిన సేల్‌డీడ్‌ను పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. డాక్యుమెంట్ మొత్తం కంప్యూటర్ ప్రింటింగ్ ఉండగా, కేవలం షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ మాత్రం పెన్నుతో రాసి ఉండటం గమనార్హం. అందులో పూర్వం నుంచి ఉన్న రోడ్డు ఒకవైపు ఉండగానే, మరోవైపు తూర్పు వైపు వంద ఫీట్ల రహదారితోపాటు అమ్మిన సత్యనారాయణ భూమి కూడా ఉన్నదని రాశారు. దీంతో అసలు గ్రామ నక్ష, మాస్టర్‌ప్లాన్ ఇలా ఏ ప్రభుత్వ రికార్డుల్లోనూ లేని వంద ఫీట్ల రోడ్డు డాక్యుమెంట్లో ఎలా వస్తుందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా సత్యనారాయణ నుంచి వ్యవసాయ భూమిగా రెండెకరాలు కొనుగో లు చేసినప్పటికీ సేల్‌డీడ్‌లో చదరపు గజాలుగా మా ర్చారని, నాలా అనుమతి లేకుండా చదరపు గజాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఏమిటని, అప్పటి సబ్ రిజిస్ట్రార్ దానిని అనుమతించడంలోనే అనుమానా లు ఉన్నాయని వారు సందేహాలు వ్యక్తంచేశారు. న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకువెళ్లినట్టు రైతు సత్యనారాయణ వెల్లడించారు.
లహరి రిసార్ట్ వాళ్లకు రోడ్డు లేకపోతే 22 ఏండ్ల క్రితం కరికె సత్యనారాయణ రెండెకరాల అమ్మిండు. ఇప్పుడు రిసార్ట్ వాళ్లు ఆయన పొలంలోకి వచ్చి పిలర్లు వేసి కబ్జా చేయాలని చూడటం కరెక్ట్ కాదు. అప్పుడు ఏం జరిగిందో గ్రామస్తులందరికీ తెలుసు. రైతులను మోసం చేయాలని చూడటం మంచి పద్ధతి కాదు. సత్యనారాయణకు న్యాయం జరిగేదాకా మేమందరం ముందుంటాం.
– అంబరి ఈశ్వరయ్య, గ్రామస్తుడు
సత్యనారాయణ భూమిని లహరి రిసార్ట్ వాళ్లు అన్యాయంగా కబ్జా చేస్తున్నరు. ఆయన ఇచ్చిన భూమిలో నుంచే లహరికి రోడ్డు వచ్చింది. ఇప్పుడు పక్కన భూమిలోకి కబ్జాకు రావడం కరెక్ట్ కాదు. ఆయనకు ఊరుఊరంతా అండగా ఉన్నది. రిసార్ట్ యజమాని రైతుల భూములను కబ్జా చేయాలని చూస్తే ఊరుకోం.
– అంజయ్య గ్రామస్తుడు
రైతు సత్యనారాయణ ఆరోపిస్తున్నట్లుగా తాము ఎలాంటి భూ ఆక్రమణకు పాల్పడలేదని లహరి రిసార్ట్ యజమాని హరిబాబు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే తాము భూమిలో పొజిషన్ తీసుకున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, కోర్డు ఆర్డర్ తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఏదైనా కోర్టు పరిధిలోనే చూసుకుంటామని స్పష్టంచేశారు. ప్రస్తుతం భూ వివాదం కోర్టు పరిధిలో ఉన్నదని హరిబాబు పేర్కొన్నారు.
– హరిబాబు, లహరి రిసార్ట్ యజమాని