జూలూరుపాడు, మార్చి 17 : క్షేత్రస్థాయిలో ప్రజారోగ్యం కోసం పాటుపడుతున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ నాయకుడు యాస నరేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌కు ఆశా కార్యకర్తలతో కలిసి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులు ఆశ వర్కర్లు నిరవధిక సమ్మె నిర్వహించారన్నారు. ఆ సందర్భంగా అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇప్పటి అధికార పార్టీ అయినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే ఆశాల టెంట్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఇన్సూరెన్స్ రూ.50 లక్షలు చెల్లించాలని, ఆశలకు మట్టి ఖర్చులు రూ.50 వేలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని, సీనియర్ ఆశా వర్కర్లకు ఏఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చి ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్‌లో ఆశ వర్కర్లు నిర్వహించే పోరాటాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఆశాలరంగం జిల్లా అధ్యక్షురాలు పూనెమ్ ఝాన్సీ, ఆశా వర్కర్లు వెంకటలక్ష్మి, పద్మ, సరోజ పాల్గొన్నారు.