– గోడలపై వెల్లివిరిసిన శ్రమైక జీవన సౌందర్యం
జూలూరుపాడు, ఫిబ్రవరి 21 : నేటి ఆధునిక కాలంలో కాంక్రీట్ కట్టడాలు పెరిగిపోతున్నా, సొంత ఊరుని, పుట్టిన గడ్డ సంస్కృతిని మర్చిపోని వారు కొందరే ఉంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని కాకర్ల గ్రామంలో ఒక ఇంటి ప్రహరీ గోడలు ఇప్పుడు ఆ ప్రాంతానికే ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఆ గోడలపై ఆవిష్కృతమైన చిత్రాలు చూస్తుంటే గ్రామీణ భారతపు ఆత్మ, శ్రమైక జీవన సౌందర్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి.

కాకర్ల గ్రామంలో కళాత్మక సందడి
గ్రామానికి చెందిన ప్రముఖులు, హైకోర్టు న్యాయవాది హరి శ్రీధర్ తన ఇంటి ప్రహరీపై ఎంతో అభిరుచితో ఈ పెయింటింగ్స్‌ను వేయించారు. ప్రధానంగా ‘వార్లి’ (Warli Art) శైలిలో వేయబడిన ఈ చిత్రాలు పల్లెటూరి జీవన విధానాన్ని అత్యంత సహజంగా ప్రతిబింబిస్తున్నాయి. ఎరుపు రంగు గోడల మీద తెల్లటి వర్ణంతో గీసిన ఈ చిత్రాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ భారీ గోడలపై కేవలం రంగులు మాత్రమే లేవు, గ్రామీణ సంస్కృతికి సంబంధించిన అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి, వ్యవసాయ పనులు, ఎడ్లబండ్లు, దుక్కి దున్నడం, రైతుల శ్రమ, జానపద ఉత్సవాలు, గిరిజన సాంప్రదాయ నృత్యాలు (ధింసా వంటివి), వాయిద్యకారుల సందడి, గ్రామీణ జీవనం, మహిళలు దంచుతున్న దృశ్యాలు, నీటిని తెచ్చే దృశ్యాలు, చెట్ల కింద ఆడుకునే పిల్లలు, దైవ సంకల్పం, గ్రామీణ ప్రాంతాల్లో కొలిచే దైవ స్వరూపాలు, పండుగల కోలాహలం ఇలా అనేక చిత్రాలు గోడలపై ప్రతిబింభించేలా చిత్రీకరించారు.

కాకర్ల గ్రామంలో కళాత్మక సందడి
మారుతున్న కాలంతో పాటు పాత సంప్రదాయాలను మర్చిపోతున్న ఈ రోజుల్లో రేపటి తరానికి మన మూలాలను గుర్తు చేసేలా హరి శ్రీధర్ చేసిన ఈ ప్రయత్నంపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “మన ఊరు-మన సంస్కృతి” అన్నట్లుగా ఈ చిత్రాలు పల్లెటూరి అందాలను ఒక ఆర్ట్ గ్యాలరీలా మార్చేశాయని పలువురు మేధావులు, విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ గోడల చిత్రాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. కాకర్ల గ్రామం గుండా వెళ్లే బాటసారులు సైతం ఒక నిమిషం ఆగి ఈ కళాఖండాలను ఆసక్తిగా చూస్తూ ఫోటోలు తీసుకుంటున్నారు. శ్రమను అందంగా మలిచిన ఈ గోడలు, పల్లెటూరి కళలకు నిలువుటద్దంగా నిలుస్తున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

కాకర్ల గ్రామంలో కళాత్మక సందడి