భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 21 : జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్‌తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇంగ్లీష్ ఫైనల్ ప్రాక్టికల్ పరీక్షలు జనరల్ అలాగే ఓకేషనల్ కోర్సుల ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఈ నెల 21న (9,278 మంది), సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈ నెల 22న (9,413 మంది) నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షలు ఈ నెల 23న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు ఈ నెల 24న నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ జనరల్, ఓకేషనల్ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుండి ఫిబ్రవరి 20 వరకు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు ప్రతిరోజూ ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 37 థియరీ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఫస్ట్ ఇయర్‌కు 9,278 మంది, సెకండ్ ఇయర్‌కు 9,407 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణకు 550 మంది ఇన్విజిలేటర్లు, 37 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 14 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు నియమించనున్నట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాల భద్రతకు పోలీస్ శాఖ సహకారంతో కట్టుదిట్టమైన చర్యలు చెపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్ సరఫరా, ఫర్నిచర్, శుభ్రత, వైద్య సదుపాయాలు తదితర అన్ని మౌలిక వసతులు సమకూర్చాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను ముందుగానే సిద్ధం చేసుకుని, నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరావు, టేకులపల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సులోచన రాణి, ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ అరవింద్ బాబు, డిప్యూటీ డిఎంహెచ్ఓ ప్రసాద్, పోలీస్ శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.