రుద్రంపూర్, జూన్ 02 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణలో కొత్తగూడెం సింగరేణి ఏరియా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని కార్మికులు, తెలంగాణ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించినప్పటికీ, ఆ మేరకు ఏర్పాట్లు జరగలేదని వారు ఆరోపించారు. ప్రతి సంవత్సరం రుద్రంపూర్‌లోని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రాంగణంలో ఉన్న అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విగ్రహాలను అందంగా అలంకరించి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వేడుకలకు వారం రోజుల ముందుగానే ప్రాంగణాన్ని ముస్తాబు చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పెయింటింగ్ పనులు చేపట్టేవారు.
అయితే ఈసారి కొన్ని చోట్ల తూతూ మంత్రంగా పెయింటింగ్ పనులు చేపట్టి వాటిని కూడా పూర్తిచేయలేదని, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి కనీసం పెయింటింగ్ కూడా వేయించలేదని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి తమ సొంత ఖర్చులతో పెయింటింగ్ పనులను చేసుకున్నారు.అవతరణ దినోత్సవాల కోసం ఏర్పాటుచేసిన కమిటీ పర్యవేక్షణ లోపమా, లేక మరో ఉద్దేశమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
ఉదయం జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని జీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తెలంగాణ పట్ల నిబద్ధత, గౌరవం లేని వ్యక్తులను కమిటీల్లో చేర్చడం వల్లే ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యమకారులు కోరారు. ఇప్పటికైనా మిగిలిపోయిన పనులను ఆవిర్భావ దినోత్సవం అయిపోయింది అని చేతులు దోచుకోకుండా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే విధంగా ఏరియా జిఎం ప్రత్యేక చర్వ తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు.