రామవరం, డిసెంబర్ 06 : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 2025-26 సంవత్సరానికి ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థుల నుండి అప్రెంటిస్షిప్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి శనివారం సర్కులర్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ శనివారం నుండి ప్రారంభమై ఈ నెల 25 వరకు కొనసాగనున్నట్లు సర్కులర్లో వెల్లడించారు. సంబంధిత ట్రేడ్లో 10వ తరగతి/ఎస్సెస్సీతో పాటు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఐటీఐ ఉత్తీర్ణులైన సంవత్సరం ఆధారంగా ఇంటర్-సీ సీనియారిటీ, మార్కుల శాతాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని సంస్థ వెల్లడించింది. 18 నుంచి 28 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే వారు మొదట నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS) పోర్టల్లో నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ నంబర్ పొందాలి. అనంతరం సింగరేణి అధికారిక వెబ్సైట్ www.scclmines.com/apprenticeship ద్వారా ఆన్లైన్ దరఖాస్తు సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తు చేసిన తర్వాత రూపొందిన అప్లికేషన్ను ప్రింట్ తీసుకుని, సంతకం చేసి, అవసరమైన సర్టిఫికేట్ల ప్రతులతో సమీపంలోని మైన్స్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ (MVTC)లో సమర్పించాలి.
అప్రెంటిస్షిప్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు హామీ ఇవ్వబడవని, ఇది కేవలం శిక్షణ పరమైన కార్యక్రమమేనని SCCL స్పష్టం చేసింది. తాజా వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సిందిగా సూచించింది. ఐటీఐలో ఈ ట్రేడ్లు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, డీజిల్ మెక్, మెషినిస్ట్, DM(సివిల్), ఎంఎంవి, మౌల్డర్.