లక్ష్మీదేవిపల్లి : రైతులందరికీ సరిపడా యూరియా వెంటనే సరఫరా చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని స్థానిక మార్కెటియార్డులో యూరియా సరఫరా కేంద్రాన్ని పరిశీలించారు. యూరియా కొరతను నిరసిస్తూ జాతీయ రహదారిపై సిపిఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ సీజన్ లో యూరియా అందించకపోవడం వల్ల ఆరుకాలం కష్టపడ్డ పంట చేతికి అందక నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని తెలిపారు. యూరియాను దిగుమతి చేసుకొని రైతులందరికీ సరిపడ యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వాంకుడోత్ కోబల్, రైతులు భూక్యా బాలకిషన్, అజ్మీర కుమార్, నరేష్, రమేష్, పుల్సింగ్ తదితరులు పాల్గొన్నారు.