జూలూరుపాడు, జూలై 01 : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని వెంగన్నపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యాసా నరేష్ పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులను, పేద రైతులను తీవ్ర అన్యాయానికి గురిచేస్తోందని ధ్వజమెత్తారు. గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి నిరంతరం తూట్లు పొడుస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీల పొట్టగొట్టేలా రకరకాల సాంకేతిక కొర్రీలు పెడుతూ, ఫీల్డ్లోకి యంత్రీకరణను తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం క్రమంగా ఉపాధి హామీ నుంచి తప్పుకోవాలని చూస్తోందని ఆరోపించారు.
అందులో భాగంగానే ఇప్పుడు గాంధీజీ పేరును తొలగించి, దాని స్థానంలో వీబీ జీ రామ్ జీ అనే నూతన పథకాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దేందుకు కేంద్రం సిద్ధమైందని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా మొండిగా జీవోలను అమలు చేయడానికే కేంద్రం మొగ్గు చూపుతోందని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకునే వరకు పోరాటాలు ఆపేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు రెడ్డిబోయిన గోవిందు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి రాచబంటి కోటేశ్వరరావు, మహిళా కూలీల మండల కన్వీనర్ పద్దం సుగుణ, సంఘం మండల నాయకురాలు తాటి ఇందిర, రైతు సంఘం మండల నాయకులు జల్లిక రాధాకృష్ణ, గార్లపాటి వెంకటి, బోడ అభిమిత్ర, తంబళ్ల అశోక్ ఉపాధి హామీ కూలీలు, రైతులు పాల్గొన్నారు.