రామవరం, ఏప్రిల్ 28 : సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలు పొందిన వారు సంవత్సరానికి కనీసం వంద మస్టర్లు కూడా హాజరు కావడం లేదని, ఇకపై విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని గని ఏజెంట్ బూర రవీందర్ అన్నారు. కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.షాలెం రాజు ఆదేశానుసారం 2025 సంవత్సరంలో 01.01.2025 (జనవరి) నుండి 21.04.2025 ( ఏప్రిల్ ) వరకు 40 మస్టర్ కన్నా తక్కువ ఉన్న ఉద్యోగులకు సోమవారం పీవీకే.5 ఇంక్లైన్ ఏజెంట్ ఆఫీస్ నందు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల గైర్హాజరుతో కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, రవాణా విషయాల్లో లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతున్నదని, తద్వారా ఉన్న ఉద్యోగులకు పని భారం పెరుగుతుందని తెలిపారు.
సింగరేణి సంస్థలో అంతర్గత ఉద్యోగాలకు ఎటువంటి కేటగిరితో సంబంధం లేకుండా విద్యార్హతను పరిగణలోకి తీసుకుని నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని, దానిని ఉపయోగించుకుని ఎంతోమంది ఉన్నత పదవుల్లో ఉన్నట్లు తెలిపారు. సంస్థలో జనరల్ మజ్దూర్ గా విధులు నిర్వహిస్తూ ఇంటర్నల్ గా పదోన్నతలు పొంది జనరల్ మేనేజర్ స్థాయిలో రిటైర్డ్ అయిన వారు కూడా ఉన్నారని అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని విధులకు హాజరు కావాలని చెప్పారు.
గైర్హాజరవుతున్న ఉద్యోగులకు మరోసారి అవకాశం కల్పిస్తున్నామని, వారు తప్పక రాబోవు మూడు నెలల్లో ప్రతి నెలకు కనీసం 20 మస్టర్లు చేయాలన్నారు. లేనిపక్షంలో వారిపై యాజమాన్యం తీసుకునే చర్యలకు వారే బాధ్యులు అవుతారన్నారు. గైర్హాజరైన 149 ఉద్యోగుల్లో దాదాపుగా 77 మంది ఉద్యోగులు కౌన్సిలింగ్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఇంజినీర్ శుభకర్, మేనేజర్ ఎంవిఎన్ శ్యామ్ ప్రసాద్, సంక్షేమ అధికారి షకీల్, ఏ.ఐ.టి.యూ.సి అసిస్టెంట్ పిట్ సెక్రటరీ సాయి పవన్, ఐ.ఎన్.టి.యూ.సి పిట్ సెక్రటరీ చిల్కా రాజయ్య పాల్గొన్నారు.