కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 02 : గత 20 ఏళ్లకు పైగా సాగులో ఉన్న భూముల్లో పంటలను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడెం ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఫారెస్ట్ అధికారులు చర్ల, దుమ్ముగూడెం, పాల్వంచ, జూలూరుపాడు మండల ప్రాంతాల్లో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూముల్లో చేతికొచ్చిన పంటను ధ్వంసం చేస్తూ, తిరిగి ఆదివాసీలపైనే కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. పత్తి చేలు మొత్తం పిందె పడి కాయ దగ్గరికి వచ్చిందని, చేతికి వచ్చిన పంటను ఫారెస్ట్ అధికారులు వచ్చి నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో సర్వేలు చేసి హద్దులు పెట్టుకొని భూములు సాగు చేసుకుంటుంటే మళ్లీ అదే ఫారెస్ట్ అధికారులు అక్రమంగా పంటలను ధ్వంసం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
జూలూరుపాడు మండలం ఎలకలోడ్డు గ్రామానికి చెందిన మడిమే హిడ్మ 30 గుంటల భూమిని మొత్తం సర్వనాశనం చేశారని, పాల్వంచ మండలం బంజర, చిరుతంపాడు, పడగొనిగూడెం, చర్ల, దుమ్ముగూడెంలో రెండు వందల ఎకరాల్లో ఫారెస్ట్ అధికారులు పంటలను మొత్తం సర్వనాశనం చేసి తిరిగి ఏడుగురు మహిళలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అటవీ హక్కుల చట్టం, పిసా తీర్మాణాలను ఉల్లంఘిస్తున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకుని, పంట నష్టం పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపకపోతే న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు సత్యమ్మ, సారమ్మ, ముత్తమ్మ, లింగయ్య, నాగయ్య, కొమరయ్య, అనిల్, ఉపేంద్ర పాల్గొన్నారు.