పాల్వంచ ఫిబ్రవరి 14 : మనస్థాపంతో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. పాల్వంచ పట్టణ పరిధిలోని మెడికల్ కాలేజీలో తాపీ పని చేసుకునే పశ్చిమ బెంగాల్ జిల్లాకు చెందిన షేక్ గోలెం (19) అనే యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మున్సిపూర్ గ్రామానికి చెందిన షేక్ గోలెం నవభారత్ వద్దగల మెడికల్ కాలేజీలో తాపీ పని చేసేందుకు సతీష్ అనే కాంట్రాక్టర్ వద్దకు గత నెల క్రితం వచ్చాడు.
ఈ క్రమంలో గురువారం సాయంత్రం షేక్ గోలెం తన వారెవరికి చెప్పకుండా సమీపంలోని అడవిలోకి పోయి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన సొంతూరులో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, ఆమె ప్రేమ దూరమైందనే మనస్థాపంతో ఈ ఆత్మహత్య చేసుకున్నాడని మేనమామ రహమతుల్లా తెలిపారు. మృతుని మేనమామ ఫిర్యాదు మేరకు పాల్వంచ పట్టణ పోలీసులు మృతదేహాన్ని పాల్వంచ ప్రభుత్వ దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పట్టణ ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.