లక్ష్మీదేవిపల్లి, ఆగస్టు 22 : వేధింపులు తాళలేక మనస్థాపంతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం బంగారు చిలక గ్రామ పంచాయతీ పరిధి పాత బంగారు చిలక గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పాత బంగారు చిలక గ్రామానికి చెందిన కోడిరెక్కల సుధీర్(24)కు గ్రామంలో ఓ అక్రమ సంబంధం విషయం తెలుసంటూ అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రచారం చేస్తున్నారు. సుధీరపై అసత్య ప్రచారాలను ముమ్మరం చేయడంతో పాటు వారు బెదిరింపులకు సైతం పాల్పడ్డారు.
దీంతో వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో వారి పేర్లు రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ లేఖ ఆధారంగా సుధీర్ తండ్రి లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో నిందితులపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్సత్రికి తరలించారు. కాగా ఫిర్యాదులో నిందితుల పేర్లు తొలగించేందుకు ఓ పార్టీకి చెందిన నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.