చండ్రుగొండ, సెప్టెంబర్ 26 : పల్లెల్లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం చండ్రుగొండ మండలం మహ్మద్‌నగర్ గ్రామంలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, తమ గ్రామంలో పేరుకుపోయిన సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రజలు ప్రశ్నిస్తుండగా.. వారికి మైక్ ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. గ్రామంలో అధికారుల సమక్షంలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ.. తాను మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని, ఏమైనా సమస్యలు ఉంటే చెబితే.. వాటిని పరిష్కరిస్తారని అన్నారు.
వెంటనే గ్రామస్తులు కమాల్, లాల్ అహ్మద్, కరీంబీ, హుస్సేన్, బాద్షా, అజ్గర్, ఖాసీలు తమ గ్రామంలోని సమస్యల గురించి ఏకరువు పెట్టారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా రైతుల రుణమాఫీ పూర్తిగా కాలేదని, పెన్షన్లను ఎప్పటి నుంచి పెంచి పంపిణీ చేస్తారని, మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఎప్పటి నుంచి ఇస్తారని వారు ప్రశ్నించారు. గ్రామంలో ఐదు నిమిషాలకోసారి కరెంటు పోతున్నదని, తాగునీరు సైతం సక్రమంగా సరఫరా చేయడం లేదని, కొత్త ఇళ్లు నిర్మించుకుంటే ఇంటి నెంబర్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్న వారిని అడ్డుకోవడంతోపాటు వారికి మైక్ కూడా ఇవ్వలేదు. ఎమ్మెల్యే కలుగజేసుకొని వారిని సముదాయించారు.
కొందరు రైతులకు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాలేదని, వారికి త్వరలోనే మాఫీ అవుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తానని చెప్పారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సంజీవరావు, ఎంపీడీవో అశోక్, ఏఈలు సాయికృష్ణ, శ్రీనివాసరావు, హరికృష్ణ, నరసింహారావు, ఏపీఎం సంతోశ్, నాయకులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, మాలోత్ బోజ్యానాయక్, నల్లమోతు రమణ, తుమ్మలపల్లి సురేశ్, ధరావత్ రామారావు, కీసరి భద్రయ్య, ఇంజం అప్పారావు, బానోత్ రాముడు పాల్గొన్నారు.