మధిర, అక్టోబర్ 12: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మధిరలో గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్‌రాజు అన్నారు. మధిర పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఆయన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి నిర్వహించిన బూత్ జోనల్ లెవల్ పార్టీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ప్రజల ఓట్లతో గెలిచి వారి సంక్షేమాన్ని విస్మరించారన్నారు.
అయినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం మధిర నియోజకవర్గ అభివృద్ధికి రూ.కోట్లు వెచ్చించిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్‌గా, ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేశారని, అయినా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకపోయిందన్నారు. ఆయనకు ఓటమి భయం పట్టుకుందని, ఈ కారణంతోనే ఆయన దళితబంధు, గృహలక్ష్మి వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అనంతరం బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ పార్టీ, టీడీపీకి చెందిన 30 కుటుంబాలకు గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, నాయకులు చిత్తారు నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, మొండితోక జయాకర్, రావూరి శ్రీనివాసరావు, చేబ్రోలు మల్లికార్జునరావు, పంబి సాంబశివరావు, పెంట్యాల పుల్లయ్య, కనుమూరు వెంకటేశ్వరరావు, దాచేపల్లి లక్ష్మారెడ్డి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.