హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తేతెలంగాణ): జగిత్యాల మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నికపై పీఠముడి చిక్కు వీడలేదు. పదవిపై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ పట్టు వీడలేదు. దీంతో పంచాయితీ హైదరాబాద్ పార్టీ అధిష్ఠానం వద్దకు చేరింది. తమ వర్గానికే చైర్మన్ పదవి దక్కాలని ఎవరికి వారుగా పట్టుపడుతున్నారు. జీవన్‌రెడ్డి నేరుగా ప్రజాభవన్‌కు వెళ్లి ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ సవాంత్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో తన సభ్యులతో కలిసి భేటీ అయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ఎమ్మెల్యే పనితీరుపై అధిష్ఠానం ప్రతినిధులకు వివరించారు. ఒకవైపు జీవన్‌రెడ్డితో చర్చలు జరుగుతుండగానే.. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫోన్ ద్వారా మాట్లాడారు. ఇదిలా ఉండగా, ఇరువర్గాలకు చెరి రెండున్నరేండ్లు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులను కట్టబెట్టేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. తొలి విడత తమకే అవకాశమివ్వాలని జీవన్‌రెడ్డి, సంజయ్ పట్టుబట్టడంతో సీల్డ్కవర్లో పంపుతామని తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఇదే సమయంలో తనకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ కౌన్సిలర్ మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉన్నది.