ఒక రాత్రిలో సీన్ మారింది. నిన్నటి దాకా గ్రేటర్ పౌరులమని మురిసిపోయిన వేలాది మందికి ఇప్పుడు కొత్త కష్టాలు తప్పవనే చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం పంపిన మూడు జీవోల తూటా.. శివారు ప్రాంతాల ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. జీహెచ్ఎంసీని మూడు ముకలు (జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి) చేస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నగరవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉన్న ఐటీ, పరిశ్రమలు ఉన్న ప్రాంతాలను మళ్లీ చిన్న కార్పొరేషన్ వైపు మళ్లించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. ఈ విభజన వెనుక కేవలం పరిపాలన సౌలభ్యం మాత్రమే కాకుండా, బలమైన రాజకీయ కోణం ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో పట్టు సాధించేందుకే వార్డులను అనుకూలంగా మలుచుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 పల్లె నుంచి పట్టణం.. పట్టణం నుంచి మహా నగరం.. ఇది కదా ఏ ప్రాంతమైనా ఆశించే అభివృద్ధి ప్రస్థానం!! కానీ మహానగర పాలనలో పాలన సాగుతున్న తీరు చూస్తుంటే అభివృద్ధి చక్రం వెనక్కి తిరుగుతోందా? అనే సందేహం వ్యక్తమవుతున్నది. నిన్నటి దాకా విశ్వనగరంలో అంతర్భాగంగా ఉండి.. గ్రేటర్ హోదాను అనుభవించిన ప్రాంతాలను మూడు ముక్కలు చేస్తూ తిరిగి చిన్న కార్పొరేషన్ స్థాయికి దిగజార్చడంసర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పరిపాలనా సౌలభ్యం అనే సాకుతో గ్రేటర్ పరిధిలోని ఎల్బీనగర్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఉప్పల్ లాంటి ప్రాంతాలను విడదీసి వాటిని చిన్న కార్పొరేషన్ హోదాలోకి నెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఎదిగిన బిడ్డను మళ్లీ చిన్నపిల్లాడిని చేసినట్లుగా గ్రేటర్ నుంచి విడగొట్టి సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లోకి తీసుకురావడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. జీహెచ్ఎంసీలో ఉన్నప్పుడు లభించే మౌలిక సదుపాయాలు, రవాణా అనుసంధానం, అత్యున్నత స్థాయి పాలన..చిన్న కార్పొరేషన్లతో సాధ్యమా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
మళ్లీ డీలిమిటేషన్ ?
జీహెచ్ఎంసీలో 27 పురపాలిక విలీనంతో 150 డివిజన్లను 300 డివిజన్లు చేశారు. ఈ క్రమంలో జనాభా ప్రాతిపదికను సరిగ్గా పట్టించుకోలేదు. డివిజన్లను లోపభూయిష్టంగా కేటాయించారు. ఉదాహరణకు 90 వేల జనాభా ఉన్న నాగారం మున్సిపాలిటీని ఒకే డివిజన్‌గా, 48 వేల జనాభా ఉన్న తూముకుంటను కూడా ఒకే డివిజన్‌గా పరిగణించడంపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అయితే పాలనా సౌలభ్యం కోసం చేపట్టిన డివిజన్ల పునర్విభజనపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలో డివిజన్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో మరోసారి డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టేందుకు సిద్దమవుతుండటం సర్కార్ పాలన పనితీరును ప్రశ్పిస్తున్నది. కొత్తగా ఏర్పడిన ఒకో కార్పొరేషన్లో 100 డివిజన్లకు పెంచే యోచనలో సర్కార్ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.