భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 15. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఒకటో వార్డు అర్బన్‌కాలనీలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏలే భువనేశ్వరి గెలుపొందింది. ఈ క్రమంలో ఓటమి పాలైన వల్లభోజు స్వరూపారాణి కి సంబంధించిన బంధువు, ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్, ప్రస్తుత రెండో వార్డు కౌన్సిలర్ పొలిశెట్టి అనిల్‌కుమార్ శనివారం రాత్రి కాలనీ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటువేయలేదని దుర్భాషలాడుతూ విరుచుకుపడ్డారు. శనివారం రాత్రి తన అనుచరులతో కలిసి పద్మశాలీ కులస్తుల ఇండ్లపైన ఖాళీ బీరుసీసాలతో దాడులకు పాల్పడ్డారు. దీంతో పద్మశాలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి పంచిపెట్టిన చీరలు, హాట్ బాక్స్‌లను రోడ్డు మీద పడవేశారు. ర్యాలీగా వెళ్లి పీఎస్ ఎదుట ఆందోళనచేశారు. కాంగ్రెస్ నాయకులతో తమకు ప్రాణభయం ఉందని స్టేషన్లో ఫిర్యాదు చేశారు.