– కారేపల్లి మండల వ్యాప్తంగా హాజరుకానున్న 610 మంది విద్యార్థులు
కారేపల్లి, మార్చి 12 : ఈ నెల 14 నుండి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు సింగరేణి మండల విద్యాశాఖ అధికారి జయరాజు తెలిపారు. గురువారం మండల విద్యా వనరుల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మొత్తం 3 పరీక్ష కేంద్రాల్లో 610 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. కారేపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 200 మంది, కారేపల్లి తెలంగాణ మోడల్ పాఠశాలలో 210 మంది, కోమట్లగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(సి.సెంటర్)లో 200 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు. ప్రతి సెంటర్కు ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిఓ, 9 మంది ఇన్విజిలేటర్లు పరీక్ష నిర్వహణ విధుల్లో పాల్గొననున్నట్లు వివరించారు. అదే విధంగా మూడు సిట్టింగ్ స్కాడ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
విద్యార్థులకు పరీక్ష కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా, ఇంటర్ నెట్లో డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లు కలిగి ఉన్నా అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసి వేయాలన్నారు. ప్రతి కేంద్రంలో హెల్త్ సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. దూర ప్రాంతం నుండి పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థుల కొరకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయడమైనదన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు సంబంధిత అన్ని శాఖల సిబ్బంది సహకరించాలని ఎంఈఓ కోరారు.