భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ఈ నెల 12న కొత్త జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నందున ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అధికారులకు సూచించారు. కొత్త కలెక్టరేట్లో మంగళవారం భవన సముదాయాలను పరిశీలించిన ఆయన.. అధికారులకు పలు సూచనలు చేశారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం భద్రాద్రి కలెక్టరేట్‌ను ప్రారంభించిన తర్వాత ఇక్కడి బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారని అన్నారు. ముందుగా ఇక్కడ అన్ని ఏర్పాట్లూ చేయాలని ఆదేశించారు. హెలీపాడ్ ప్రదేశాన్ని, సమీక్ష సమావేశ స్థలాన్ని శుభ్రపరచాలని సూచించారు. మంచి వాతావరణంలో ప్రారంభోత్సవం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులంతా ఒకే ప్రాంగణంలో ఉండి ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకే నూతన సమీకృత కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ నిర్మించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య కూడా అధికారులతో మాట్లాడి ఏర్పాట్లను పరిశీలించారు.
అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనపై నేపథ్యంలో కొత్త కలెక్టరేట్లో జల్లా అధికారులతో కలెక్టర్ అనుదీప్ మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఎవరికి కేటాయించిన విధులను వారు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. సీఎం సమీక్షకు ముందుగానే కార్యాలయానికి అధికారులు చేరుకోవాలని సూచించారు. బుధవారం నాటికి కలెక్టరేట్లోని అన్ని బ్లాకులూ ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎస్పీ వినీత్ కూడా ఆ శాఖ అధికారుతో మాట్లాడారు. బందోబస్తు గురించి విధులు కేటాయించారు.