Journalists | ఖమ్మం నగరంలో ఈ ఏడాది జనవరి 18న జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ నగర పరిధిలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రతి జర్నలిస్ట్‌కు 200 గజాల ఇండ్ల స్థలం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ హామీ త్వరలో సాకారం కానున్నది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని గురువారం రాష్ట్ర క్యాబినేట్‌తో ఇండ్ల పంపిణీ దస్ర్తాన్ని ఆమోదింపజేశారు. దీంతో జర్నలిస్టుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ సభ జరిగిన నెల రోజుల్లోపే ప్రభుత్వం నుంచి ఖమ్మం అర్బన్ రెవెన్యూ పరిధిలోని ఐదెకరాల ఇరిగేషన్‌శాఖ స్థలాన్ని జర్నలిస్టులకు కేటాయిస్తూ జీవో జారీ అయింది.. కానీ ఐదెకరాల స్థలాన్ని జర్నలిస్టులందరికీ పంపిణీ చేయడం సాధ్యం కాదని గుర్తించి మంత్రి అజయ్‌కుమార్ తిరిగి సీఎం కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. మంత్రి అజయ్ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర క్యాబినెట్ సమావేశమై మొత్తం 23 ఎకరాలను జర్నలిస్టులకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు క్యాబినేట్ ఆ తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో అనేక సంవత్సరాల నుంచి ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల కల నెరవేరినట్లయింది.
ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్న జర్నలిస్టుల బాధలను గతంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదని, వృత్తినే నమ్ముకుని నిత్యం సవాళ్లను ఎదర్కొంటూ పని చేస్తున్న తమను గుర్తించలేదని జర్నలిస్టులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం ఇండ్ల స్థలాల కోసం మొరపెట్టుకుంటే ‘ఇదిగో ఇస్తాం.. అదిగో ఇస్తాం..’ అని చెప్పి మోసం చేశాయంటున్నారు. తాము తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించామని, ఉద్యమ నాయకుడిగా సీఎం కేసీఆర్ తమ కష్టాన్ని గుర్తించారన్నారు. అన్నమాటను నిలబెట్టుకుంటూ తాజాగా ప్రకటన విడుదల చేశారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రఘునాథపాలెం, మే 18 : ఖమ్మం నియోజకవర్గంలోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు 23 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సంతోషం వ్యక్తం చేశారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో జర్నలిస్టులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కేసీఆర్‌కు, ఆ బాధ్యతను వెంటపడి నెరవేర్చిన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇళ్ల స్థలాల సమస్యను అనేకమార్లు జర్నలిస్టులు తన దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని సాధించినట్లు పేర్కొన్నారు. ఖమ్మంలో పనిచేసే జర్నలిస్టులందరికీ మంత్రి పువ్వాడ నేతృత్వంలో లబ్ధి చేకూరుతుందన్నారు.